May 31,2023 11:35

కేతు విశ్వనాథ రెడ్డి గ్రంథాలయానికి చేసిన సేవలు నిరుపమానం

- ఉపకులపతి, యోగి వేమన విశ్వవిద్యాలయం ఆచార్య చింతా సుధాకర్‌
ప్రజాశక్తి కడప అర్బన్
ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సలహామండలి సభ్యులుగా బ్రౌన్‌ గ్రంథాలయానికి చేసిన సేవలు నిరుపమానమని, ఆయనకున్న అనుభవంతో పరిశోధన కేంద్రం అభివృద్ధికి విలువైన సలహాలు, సూచనలు అందిచేవారని, ఆయన మరణం సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రానికి తీరనిలోటుగా భావిస్తున్నానని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్‌ పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం బుధవారం ఉదయం బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో ప్రసిద్ధ కథారచయిత ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి సంస్మరణ సభను నిర్వహించింది. ఈ సందర్భంగా యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్‌, కులసచివులు ఆచార్య వై.పి.వెంకట సుబ్బయ్య, సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, పరిశోధన కేంద్రం సిబ్బంది, పాఠకులు కలసి ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. తదనంతరం ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్‌ మాట్లాడుతూ ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి కథకునిగా, విద్యావేత్తగా, పరిశోధకునిగా నిరంతర సృజనశీలిగా సుప్రసిద్ధులన్నారు. ఆయన కడపజిల్లా కమలాపురం మండలంలోని రంగసాయిపురంలో జన్మించారని, ఆయన మొదటినుండి తన చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించి శాస్త్రీయ దృక్ఫథంతో మానవ సంబంధాలను విశ్లేషించి రచనలు చేశారన్నారు. విశ్వనాథరెడ్డి గారు కడపజిల్లా గ్రామ నామాలపైన లోతైన పరిశోధన చేసి విశిష్టమైన పంథాలో గ్రామ నామాలను, ఆ గ్రామాల జీవన విధానాన్ని, ఆచార వ్యవహారాలను, ఆర్థిక అసమానతలను పరిశీలించి వెలువరించిన అధ్యయన ఫలితాలు ప్రశంసనీయమన్నారు. ఆయన చేసిన పరిశోధన తరువాత తరాలవారికి మార్గదర్శకమై అనేక నిఘంటువుల రూపకల్పనకు దారితీసిందని, తాను పుట్టిన నేల, పెరిగిన సమాజం ఈ రెండిరటిని ప్రధానవస్తువుగా చేసుకొని అద్భుతమైన కథలను రాశారని, కడపజిల్లాలో ఉన్న సామాన్యుల జీవితాల్లో సంభవించే అన్నికోణాలను తనదైన మార్క్సిస్టు దృక్ఫథంతో ఆవిష్కరించారన్నారు. గ్రామీణ ప్రజలు నిత్యం అనుభవిస్తున్న దయనీయ స్థితిగతులు, వ్యవసాయరంగం ఎదుర్కొన్న సమస్యలు, పట్టణాల్లో జరుగుతున్న డొల్లతనం, రాయలసీమ ప్రజల్లో ఉన్న అభద్రతాభావం, ఫ్యాక్షన్‌ సమస్య, గ్రామ పెద్దలు విద్వేషాలతో రెచ్చగొట్టే విధానం, కులమత ద్వేషాలు తదితర అంశాలన్నీ ఆయన కథల్లో యథాతథంగా మనకళ్ళముందు నిలబెట్టి జీవిత వాస్తవికతను చూపెడతాయన్నారు. కులసచివులు ఆచార్య వై.పి.వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రానికి సలహామండలి సభ్యులుగా చేసిన ఆలోచనలు, అందించిన సూచనలు, సలహాలు సంస్థ అభివృద్ధికి దోహదపడ్డాయన్నారు. ఆయన బ్రౌన్‌ గ్రంథాలయంలో నిర్వహించే సాహితీ కార్యక్రమాలకు ఎంతో ఓర్పుగా వచ్చి పాల్గొనేవారని, హైదరాబాదు వంటి నగరాల్లో చాలాకాలం జీవితం గడిపినప్పటికీ చివరి రోజుల్లో తన సొంతగడ్డపై ఉండి అందరికీ అందుబాటులో ఉండడం ఆయనకు పుట్టిన గడ్డపై ఉన్న మమకారానికి నిదర్శనమని, ఆఖరి క్షణాల వరకు ఎంతోమంది యువకులకు మార్గదర్శకంగా నిలిచారన్నారు. సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ సి.పి.బ్రౌన్‌ కడపలో నివసించిన ప్రదేశాన్ని గుర్తించే సందర్భంలో ఆరుద్ర, ఆచార్య జి.ఎన్‌.రెడ్డి. బండి గోపాలరెడ్డిలతోపాటు ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి కూడా ఉన్నారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి కలిగిన గొప్ప కథారచయిత కేతు విశ్వనాథ రెడ్డి అని, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, వైయస్సార్‌ జీవన సాఫల్య పురస్కారం వంటి పురస్కారాలెన్నో పొందారన్నారు. ఆయన వ్యాసాలు, నాటకాలు, నాటికలు రాసినా తెలుగు సాహిత్యలోకంలో కథకునిగా శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారని, అధ్యాపకుడిగా, పరిశోధనకుడిగా, పాత్రికేయుడిగా, బహుశాస్త్రవేత్తగా, కథకుడిగా, విమర్శకుడిగా అనేక ప్రక్రియల్లో ఆయన గణనీయమైన కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా॥ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, డా॥ చింతకుంట శివారెడ్డి, గ్రంథపాలకులు ఎన్‌.రమేశ్‌రావు, జి.హరిభూషణరావు, జూనియర్‌ అసిస్టెంట్లు ఆర్‌.వెంకటరమణ, మౌనిక, పాఠకులు రంగ, నవీన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.