Dec 19,2020 08:04

      కేరళ స్థానిక స్వపరిపాలనా సంస్థల (ఎల్‌ఎస్‌జిఐ) ఎన్నికల్లో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డిఎఫ్‌) తిరుగులేని విజయం సాధించింది. మొత్తం 14 జిల్లా పంచాయతీలకు గాను 11 జిల్లా పంచాయతీలు, 152 బ్లాక్‌ పంచాయతీలకు గాను 108 బ్లాక్‌ పంచాయతీలను ఎల్‌డిఎఫ్‌ గెలుచుకుంది. అలాగే 941 గ్రామ పంచాయతీల్లో 514 పంచాయతీలను కైవసం చేసుకుంది. ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఐదింటిని, 86 మున్సిపాలిటీల్లో 35 మున్సిపాలిటీలను అది చేజిక్కించుకుంది.
       ఐదేళ్ల క్రితం అంటే 2015 ఎన్నికల్లో కన్నా ఈసారి ఎల్‌డిఎఫ్‌ ఓవరాల్‌గా మెరుగైన విజయాలను సాధించింది. గత సారి స్థానిక ఎన్నికలు జరిగేటప్పుడు కేరళలో కాంగ్రెస్‌ నేతృత్వం లోని యుడిఎఫ్‌ ప్రభుత్వం అధికారంలో వుంది. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ నాలుగున్నరేళ్ళ పాలన తరువాత ఇప్పుడీ ఎన్నికలు జరిగాయి. కాబట్టి, ఈ తీర్పును, పినరయి విజయన్‌ ప్రభుత్వ, స్థానిక సంస్థల పనితీరుకు లభించిన ప్రజామోదంగానే భావించవచ్చు.
       లైఫ్‌ మిషన్‌ (గృహ నిర్మాణం), ఆర్ద్రం (ఆరోగ్యం), ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఆధునీకరించడం, సామాజిక భద్రతా ప్రయోజనాల పెంపు వంటి అభివృద్ధి కార్యక్రమాలను పెద్దయెత్తున చేపట్టడంలో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ రికార్డును చూస్తే ప్రజలు ఇంతటి ఘన విజయాన్ని ఎల్‌డిఎఫ్‌కు చేకూర్చారు.
      కేరళలోని స్థానిక సంస్థలు అనేక విషయాల్లో మిగతా దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచాయి. దాదాపు 25 సంవత్సరాల క్రితం అంటే 1996లో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం సమర్ధవంతంగా వాటికి అధికారాలను, నిధులను వికేంద్రీకరించింది. ఇందుకు చట్టపరమైన తోడ్పాటును కూడా ఇచ్చింది. మూడంచెల పంచాయతీ వ్యవస్థ తమ కింద వున్న సంస్థల మధ్య పరిధులను స్పష్టంగా నిర్దేశించింది. జిల్లా స్థాయిలో వున్న ప్రభుత్వ పాఠశాలలు, సంస్థలు, నిత్య జీవితంతో ముడిపడి వున్న ఆస్పత్రులు, వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, సూక్ష్మ నీటిపారుదల, చిన్న తరహా పరిశ్రమల రంగాలు వీటన్నిటినీ మూడంచెల పంచాయితీ వ్యవస్థ కిందికి తీసుకొచ్చింది. రహదారులను అభివృద్ధిపరచడం, గృహ నిర్మాణం, పారిశుధ్యం, తాగునీటి సౌకర్యాలు వంటి మౌలిక సేవలను అందించే బాధ్యతను కూడా వీటికే అప్పగించింది. ప్రజలకు మౌలిక సేవలను అందించడంతో పాటు గత నాలుగున్నరేళ్ళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ హయాంలో సాధికారత సాధించిన స్థానిక సంస్థలు 2018, 2019లలో వచ్చిన వరదలను, తర్వాత వచ్చిన కరోనా మహమ్మారిని అత్యంత సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయి. కోవిడ్‌ గురించి విస్తృత స్థాయిలో ప్రజలను చైతన్యపరచడం, కోవిడ్‌ బాధితులను గుర్తించి, వారికి సంబంధించిన డేటాను సేకరించడంలోను, క్వారంటైన్‌ నిబంధనలు అమలు చేయడంలోను, ప్రజలకు ముఖ్యంగా కరోనా సోకిన వారికి నిత్యావసరాలు అందేలా చూడడంలోను దాదాపు 1200 స్థానిక సంస్థలు అద్భుతమైన కృషి చేశాయి.
       స్థానిక సంస్థలు చేసిన ఈ కృషి లేదా స్థానిక పరిణామాలకు సంబంధించిన అంశాలు ఇవేవీ ప్రతిపక్షాలైన యుడిఎఫ్‌, బిజెపిలకు పట్టలేదు. వారి ఎన్నికల ప్రచారం ఎంతసేపూ ముఖ్యమంత్రి, ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంలోని ఇతర మంత్రులు, సిపిఎం నేతలపై నిరాధారమైన అవినీతి, కుంభకోణాల ఆరోపణలు గుప్పించడం చుట్టూనే తిరిగింది. ప్రధాన స్రవంతిలోని మీడియాలో ఒక సెక్షన్‌ దీనిని మరింత ఎగదోయడంలో తన వంతు పాత్ర పోషించింది. బంగారం అక్రమ రవాణా కేసు, లైఫ్‌ మిషన్‌, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో అవకతవకలు జరిగాయంటూ దుష్ప్రచారం సాగించడం, పెద్దయెత్తున తప్పుడు సమాచారం గుప్పించడంపై దృష్టి పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని మీడియాకు లీకులు వదిలింది.
         ఈ విధమైన తప్పుడు ప్రచారం చేయడంలో కాంగ్రెస్‌, బిజెపి ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. ఎల్‌డిఎఫ్‌ను అపఖ్యాతిపాలు చేయడానికి ఇదొక్కటే మార్గమని కాంగ్రెస్‌, బిజెపి భావించాయి. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం, స్థానిక సంస్థలు ప్రజలకుసేవలు అందించడంలో అద్భుతమైన కృషి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అవి పడరాని పాట్లు పడ్డాయి.
కానీ, కేరళ ప్రజలు ఈ ప్రతికూల, నీతిమాలిన ప్రచారాన్ని తిప్పికొట్టారు. వారు తమ స్వీయానుభవంతో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ పాలనలో తమకు జరిగిన మేలును గుర్తించి ఓటు చేశారు.
       తనకు బలమైన కేంద్రాలుగా ఉన్న కొట్టాయం జిల్లా పంచాయతీ, కొచ్చి మున్సిపల్‌ కార్పొరేషన్లలో యుడిఎఫ్‌ ఈ సారి పరాజయం పాలైంది. తిరువనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని చూసిన బిజెపికి గతసారి కన్నా తక్కువ సీట్లు వచ్చాయి. ఎల్‌డిఎఫ్‌కు లభించిన ఈ అద్భుత విజయం ముమ్మాటికీ అభినందనీయం. కేరళ అభివృద్ధిలో కీలక భూమిక వహిస్తున్న స్థానిక స్వపరిపాలనా సంస్థలను మరింత బలోపేతం చేయడానికి ఈ విజయం దోహద పడుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్‌-మే మాసాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ఎల్‌డిఎఫ్‌ మరింత దృఢ చిత్తంతో, నైతిక స్థయిర్యంతో ఎదుర్కోవడానికి ఈ ఫలితాలు ఎంతో ప్రేరణనిస్తాయి.


                                        2015 ల్లో కేరళ స్థానిక ఎన్నికల ఫలితాల తీరు 

ఫ్రంట్‌        గ్రామ పంచాయతీ    బ్లాక్‌  పంచాయతీ    జిల్లా పంచాయతీ    మున్సిపాలిటీ     కార్పొరేషన్‌   

ఎల్‌డిఎఫ్‌        549                89                         7                    44                       4

యుడిఎఫ్‌       365                62                         7                    41                       2

బిజెపి              14                  0                         0                       1                       0

ఇతరులు          13                  1                         0                       0                       0

మొత్తం           941                152                     14                    86                        6

                                           2020 ల్లో కేరళ స్థానిక ఎన్నికల ఫలితాల తీరు 

 గ్రామ పంచాయతీ        బ్లాక్‌  పంచాయతీ       జిల్లా పంచాయతీ           మున్సిపాలిటీ    కార్పొరేషన్‌
       514                          108                      11                        35                       5

       375                            44                       2                         45                       1

         23                            0                        0                           2                         0

         29                            0                       1 టై                       4 టై                       0

       941                         152                       14                        86                        6
        

('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)