Mar 14,2022 07:35
  • ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు
  • 90 శాతం విద్యార్థులకు ప్రభుత్వ విద్య
  • బిజివిఎస్‌ జాతీయ అధ్యక్షులు పి.రామకృష్ణన్‌

ప్రజాశక్తి - అనంతపురం ప్రతినిధి : 'మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా బోధనలో ఆధునిక మార్పులు తీసుకురావడం, ప్రతి తరగతి గదికీ ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా చర్యలు తీసుకోవడం వంటి చర్యలను కేరళ ప్రభుత్వం చేపడుతోంది' అని భారత జ్ఞాన విజ్ఞాన సమితి (బిజివిఎస్‌) జాతీయ అధ్యక్షులు పి.రామకృష్ణన్‌ తెలిపారు. యుటిఎఫ్‌ 16వ రాష్ట్ర మహాసభ సందర్భంగా జరుగుతున్న విద్యా సదస్సులో పాల్గొనేందుకు ఆయన అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా విద్యలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోన్న కేరళ ప్రభుత్వం అనుసరిస్తోన్న విద్యా విధానం గురించి ఆయన 'ప్రజాశక్తి'కి ఇంటర్య్వూ ఇచ్చారు.
 

                                   ప్రశ్న : దేశంలోనే విద్యా విధానంలో కేరళ రాష్ట్రం అగ్రభాగాన ఏ రకంగా నిలుస్తోంది ?

జవాబు : సాంకేతిక మేళవించి బోధన చేయడంతో పాటు ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయలు మెరుగుపరచడం నిరంతరం జరుగుతూ ఉంటోంది. ఉపాధ్యాయులకు ప్రతి ఏటా శిక్షణ తరగతులు నిర్వహించి వారి నైపుణ్యాన్ని పెంపొందిస్తారు.
 

                                                       ప్రశ్న : ఎటువంటి సాకేంతికను వినియోగిస్తున్నారు ?

జవాబు : కేరళ రాష్ట్రంలో 45 వేల సెకండరీ పాఠశాలలు ఉన్నాయి. వీటిన్నింటిలోనూ డిజిటల్‌ క్లాసులు నడుస్తున్నాయి. విద్యార్థులు నేరుగా డిజిటల్‌ వినియోగం ద్వారా పాఠాలు నేర్చుకుంటారు. ఇక ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీలో డిజిటల్‌ లేబరేటరీలు ఉంటాయి. వీటిల్లో వారికి ప్రత్యేకమైన శిక్షణనిస్తారు.
 

                                   ప్రశ్న : లాక్‌డౌన్‌ సమయాల్లో విద్యార్థులకు ఏ రకంగా విద్యను అందించగలిగారు ?

జవాబు : లాక్‌డౌన్‌ సమయాల్లో కేరళలోనూ నిబంధనలు పాటించారు. పాఠశాలలు తెరవలేదు. ఆ సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆన్‌లైన్‌ క్లాసులు నడిచాయి. ఆన్‌లైన్‌ సౌకర్యం, మొబైల్‌ ఫోనులేని విద్యార్థులుంటే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక కమ్యూనిటీల ద్వారా మొబైల్‌ ఫోన్లు విద్యార్థులకు అందజేశారు. అదే సమంయలో నెట్‌వర్కులేని వారికి వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి వారికి అందుబాటులో ఉండే విధంగా చూశారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
 

                                           ప్రశ్న : విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది. ?

జవాబు : కేరళలో ప్రభుత్వ విద్య బలీయంగా ఉంది. అందరికీ సమాన విద్య అందివ్వాలన్నది లక్ష్యం. విద్యకు బడ్జెట్‌లో 20 శాతం వరకు నిధులు కేటాయిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవడం, మౌలిక సదుపాయలు మెరుగుపరచడం వంటి వాటితో అత్యధిక మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరుతున్నారు. 86 శాతం మంది ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థులు చదువుతున్నారు. వారికి విద్యా సంవత్సరం ఆఖరి రోజుకే వచ్చే విద్యా సంవత్సరం నాటి పుస్తకాలు కూడా అందజేస్తున్నారు.
 

                                                           ప్ర : ఉన్నత విద్య పరిస్థితి ఏ రకంగా ఉంది ?

జ : ఉన్నత విద్యపై మరింత దృష్టి సారించాల్సిన అవసరముందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో అత్యధికంగా నిధులు ఉన్నత విద్యకే ఖర్చు చేయాలని నిర్ణయించింది. 2022-23 బడ్జెట్‌లో దానికే అధిక ప్రాధాన్యతనిచ్చింది. రాబోయే రోజుల్లో ఉనత్న విద్యను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టనుంది.