Jul 09,2021 21:38

న్యూఢిల్లీ : కరోనా రెండో దశ తగ్గుముఖం పడుతున్న సమయంలో కేరళలో కొత్తగా జికా వైరస్‌ కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో జికా వైరస్‌ కేసుల సంఖ్య 14కు చేరింది. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితిని పర్యవేక్షించేందుకు, ఈ కేసుల వ్యాప్తిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన వైద్య నిపుణుల బృందం అక్కడకు బయలుదేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ, జికా వైరస్‌ను ఎదుర్కోవడంపై వెక్టార్‌ాబోర్న్‌ నిపుణులు, ఎయిమ్స్‌ వైద్యులు ఇప్పటికే పలు సూచనలు చేశారని తెలిపారు. రాష్ట్రంలో తొలి జికా వైరస్‌ కేసు తిరువనంతపురం జిల్లా పరస్సల పట్టణానికి చెందిన 24 ఏళ్ల గర్భిణిలో గురువారం నిర్ధారణ అయింది. ఆమె శాంపిల్‌ను గతవారం పూణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపగా, తాజాగా రిపోర్టు వచ్చింది. బుధవారం నాడు బిడ్డకు జన్మనిచ్చిన ఆ మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. గత నెల 28న ఆమెలో జ్వరం, దద్దుర్లు, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపించాయని చెప్పారు. ఆమె రాష్ట్రం దాటి ఎక్కడకు వెళ్లలేదని, స్థానికంగానే ఆమె వైరస్‌ బారిన పడినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. జికా వైరస్‌ కలకలం నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశామని, వైరస్‌ నియంత్రణకు కార్యాచరణ రూపొందించామని వీణా జార్జి పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి మొత్తం 19 శాంపిల్స్‌ను ఎన్‌ఐవికు పంపగా, శుక్రవారం నాటికి మరో 13 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ప్రభుత్వం వెల్లడించింది.