(నిన్నటి సంచిక తరువాయి)
కేరళ విద్యా రంగాన్ని గురించి మళ్ళీ కొత్తగా చెప్పాల్సింది ఏముంటుంది? అని చాలామంది అనుకోవచ్చు. కానీ కేరళ ప్రత్యేకత ఏమంటే...ఎప్పుడూ వెనకబడి పోకుండా జాగ్రత్తపడ్డమే గాదు. మరింత వినూత్నంగా వుండేందుకు కాలానుగుణంగా మారేందుకు ప్రయత్నిస్తూనే వుంటుంది.
ఉపాధ్యాయులపై విశ్వాసం
దేశంలోనే విస్తృతంగా డిజిటలైజేషన్ అయిన విద్యా వ్యవస్థ వున్న కేరళ రాష్ట్రం ఉపాధ్యాయుల స్థానాన్ని ఎప్పుడూ తక్కువ చెయ్యలేదు. ప్రత్యక్ష బోధన, విద్యార్ధులతో సంభాషణ, అవసరాలకు తగ్గ బోధన, వ్యక్తిగత శ్రద్ధ అనేవి ఉపాధ్యాయుల సృజనశీల బోధనతో తప్ప సాధ్యంగానివని కేరళ విద్యాశాఖ మంత్రి పదేపదే చెపుతుంటారు. కరోనా కాలంలో చేపట్టిన ''ఫస్ట్‌బెల్ '' పాఠాలే దీనికి నిదర్శనం ఇవన్నీ కేంద్రీకృత ఛానల్ పాఠాలు. కానీ వీటన్నిటిని రూపొందించింది సగటు టీచర్లే. పాఠం ప్రసారమయ్యేప్పుడు ఆ సబ్జెక్టు టీచరు కూడా ఆన్‌లైన్‌లో విని తీరాలి. తన విద్యార్థులతో వాటిపై చర్చించాలి. విద్యార్ధుల ప్రశ్నలకు వివరణలివ్వాలి. వారికి ప్రాజెక్టులు, అభ్యాసాలు లాంటివి అప్పగించాలి. వాటిని సరిచూడాలి. వీలున్నంతవరకు పిల్లల ఇంటికెళ్ళి ప్రత్యక్ష సంబంధాలు సైతం పెట్టుకోవాలి. ఆన్‌లైన్ పాఠాలు చెప్పడం చాలా తేలిక. కానీ ఉపాధ్యాయుల్ని ఇలా భాగస్వాముల్ని, బాధ్యుల్ని చెయ్యడం చాలా కష్టం. కానీ కేరళ దీన్ని చేసి చూపించింది. ఎలా ఇది సాధ్యమైంది ?
ఉపాధ్యాయుల్ని అన్ని నిర్ణయాల్లో ప్రజాస్వామికంగా భాగస్వాముల్ని చెయ్యడం, వారిని విశ్వసించడం, నాయకత్వం అప్పజెప్పడం కేరళ విద్యారంగ విజయాల్లో కీలకాంశం. ఉపాధ్యాయులకూ, పాఠశాలకూ, ఆ గ్రామానికీ మధ్యగల అనుబంధం కూడా అక్కడ చాలా గొప్పదంటారు. సామాన్యంగా కేరళలో ఉపాధ్యాయుల ఖాళీలుండవు. 'వెయిటింగ్ టీచర్స్' పేర ఒక కొత్త వ్యవస్థ కూడా అక్కడుంది. ఏకారణంతో కొద్దికాలం ఖాళీ ఏర్పడినా చదువులు కుంటు పడుకుండా దీన్ని ఏర్పరిచారు. మరో ముఖ్యమైన అంశం కేరళ విద్యాసంస్థలు అక్కడి మధ్య తరగతినీ, ఉన్నత మధ్య తరగతినీ, తమలో ఇముడ్చుకోగల్గడం. బలమైన, స్థిరమైన ఆ విద్యా వ్యవస్థకావడంతో అది సాధ్యమైంది. దీనివల్ల టీచర్ల పిల్లలు కూడా ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతుంటారు. కేరళ విద్యారంగానికి ఇదొక పెద్ద కలిసొచ్చిన అవకాశం. అందువల్లనే ఈ మధ్య కేరళ స్టేట్ టీచర్స్ అసోసియేషన్ (కెఎస్‌టిఎ) నలభై కంటె తక్కువ మంది పిల్లలున్న ప్రాథమిక పాఠశాలలన్నిటినీ తమ సంస్థ దత్తత తీసుకొంటుందని ప్రకటించింది. ఇలాంటిది మనం ఊహించడం కూడా అసాధ్యం.
ర్యాంకులు గుర్తింపులు
ఈ మధ్యకాలంలో విద్యారంగ ప్రమాణాల ఆధారంగా పలు సంస్థలు పలు సూచికలతో ర్యాంకులిస్తున్నాయి. ఈ సూచికలు కూడా అంతర్జాతీయ ప్రమాణాల మేరకు నిరంతరం మారుతున్నాయి. ఏ ఒక్క అంశానికో పరిమితమై గుర్తింపులివ్వడం స్థానే సమగ్రతకు పెద్దపీట వేస్తున్నారు. ఏ సూచికలతో ఏ ప్రమాణాలతో కొలిచినా కేరళ విద్యారంగంలో చెక్కుచెదర కుండా ప్రధమ స్థానంలోనే వుంటోంది.
నీతి ఆయోగ్ సుస్ధిరాభివృద్ధి లక్ష్యాల సూచిక (ఎస్.జి.డి.ఐ 2021)లో ఎనభై పాయింట్లతో కేరళది పాఠశాల విద్యారంగంలో మొదటి స్థానం. 'ఫ్రంట్ రన్నర్స్' క్యాటగిరీలో కేరళ ముందుండగా ఆంధ్రప్రదేశ్ 'పెర్ఫార్మర్స్' క్యాటగిరీకి పరిమితమై ఏభై పాయింట్లతో, అందులోనూ చిట్టచివరి స్థానంతో సరిపెట్టుకొంది. అలాగే నీతి ఆయోగ్ పాఠశాల విద్యా నాణ్యతా సూచిక (ఎస్.ఇ.క్యు.ఐ 2021)లో సైతం కేరళ 77.64 పాయింట్లతో అగ్ర స్థానంలో వుండగా ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో మాత్రమే వుంది. ఇక ''పని తీరు గ్రేడింగు సూచిక'' (పి.జి.ఐ)లో కేరళ 901 పాయింట్లతో ముందుండగా ఆంధ్రప్రదేశ్ ఏకంగా 18వ స్థానానికి పరిమితమైంది.
దీనర్థం కేరళ విద్యారంగంలో సవాళ్ళేమీ లేవనిగాదు. జననాల రేటు అతి తక్కువగా వున్న రాష్ట్రమిది. మరీ 0-14 వయస్సు పిల్లల సంఖ్య వేగంగా పడిపోతోంది. పట్టణీకరణ కూడా దాదాపు 50 శాతానికి చేరుకొంది. దీంతో గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు తగ్గిపోతున్నారు. వాటిని నిలబెట్టుకోడం కష్టంగా వుంది. మధ్యతరగతి విపరీతాకాంక్షలు, గల్ఫ్ నిధులు కూడా కేరళ విద్యారంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచీకరణ తెచ్చిన కుసంస్కృతి కామన్ స్కూలుకు ప్రతిబంధకంగా మారుతోంది. వలస కార్మికుల పిల్లలది కూడా కొత్తగా ఎదురవుతున్న సమస్య. ఇంగ్లీషు మీడియం డిమాండు వుండనే వుంది.
సామాజిక చలనాలకు అతీతంగా విద్యారంగం వుండగలదని ఎవ్వరికీ భ్రమలుండనక్కరలేదు. కానీ వీటిని ముందుగా పసిగట్టి, దీర్ఘకాలిక దృక్పథంతో, ప్రభుత్వ రంగం పట్ల గాఢమైన చిత్తశుద్ధితో విద్యారంగాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తున్న రాష్ట్రం కేరళతో పోలిస్తే ఒక్కటంటే ఒక్కటీ లేదన్నది మాత్రం ముమ్మాటికీ వాస్తవం. ఒక్క వామపక్ష ప్రభుత్వానికి మాత్రమే ఇది సాధ్యమన్నదీ అంతే వాస్తవం.
(ముగిసింది)
- వి. బాలసుబ్రహ్మణ్యం,
పి.డి.ఎఫ్ ఎమ్మెల్సీ










