మదనపల్లె అర్బన్ : కేన్సర్ బాధితుల మోహల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డోనేషన్ కార్యక్రమానికి మహిళలు, అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారు. బుధవారం మదనపల్లి 22వ వార్డు కౌన్సిలర్ ముబీనా కుమార్తె అర్ఫా అంజూమ్, మదనపల్లి ఎస్టేట్‌కు చెందిన రేనా, నిమ్మనపల్లికు చెందిన పావని హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి తమ కేశాలను దానం చేశారు. వీరికి ప్రశంస పత్రంతోపాటు పూలమొక్కలు బహుకరించారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ వయసులో చిన్న వారైనా సేవా గుణంలో గొప్ప మనసును చాటుకుంటూ చిన్నారులు, యువతులు కేశాలు దానం చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇప్పటికే 30 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేసారని, రాష్ట్ర వ్యాప్తంగా కేన్సర్ బాధితులకు ఎవరికైనా విగ్గులు కావాలంటే తమ సంస్థ ఉచితంగా పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు.










