Apr 08,2022 20:14

ఇకె నాయనార్‌ నగర్‌ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రతినిధి : ''హిమాచల్‌ ప్రదేశ్‌ అభివృద్ధికి, ఉనికికి యాపిల్‌ ఒక ప్రతీక. అక్కడ పండిన యాపిళ్లే దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలకు చేరతాయి. యాపిల్‌ తోటల సాగు ఎంతో వ్యయప్రయాసలతో కూడుకొన్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా యాపిల్‌ రైతులకు కన్నీరే దిగుబడిగా మిగులుతోంది.'' అన్నారు సిపిఎం హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ కార్యదర్శి, ప్రస్తుత ధియోగ్‌ నియోజకవర్గ శాసనసభ్యుడు రాకేష్‌ సింగ్‌. సిపిఎం మహాసభల్లో ప్రతినిధిగా పాల్గొన్న ఆయన ప్రజాశక్తి ప్రతినిధితో కాసేపు ముచ్చటించారు.
''యాపిల్‌ రైతుల దుస్థితికి కేంద్ర విధానాలే కారణం. మోడీ ప్రభుత్వం టర్కీ, ఇరాన్‌ తదితర దేశాల నుంచి యాపిళ్లను దిగుమతి చేసుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి ఎలాంటి పన్ను విధించకుండానే దిగుమతి చేసుకుంటుంది. దీంతో, హిమాచల్‌ యాపిల్‌ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గిట్టుబాటు ధర రాక విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే పరిస్థితి దారుణంగా ఉంది. రైతులకు పోరాటం తప్ప మరో మార్గం లేదు.'' అని ఆయన పేర్కొన్నారు. ''హిమాచల్‌ ప్రదేశ్‌లో నాశనమైన వ్యవసాయ రంగ సమస్యలను లేవనెత్తుతూ సిపిఎం అసెంబ్లీలోనూ, బయటా పోరాడుతోంది. రైతుల పోరాటానికి నాయకత్వం వహిస్తోంది. ప్రభుత్వం తగిన సహకారం ఇవ్వకపోవడంతో పాటు - విచ్చలవిడిగా దిగుమతులకు అవకాశం కల్పించటంతో యాపిల్‌ సాగు, ఉత్పత్తి, మార్కెట్టు వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయి. హిమాచల్‌లో చిన్న తరహా రైతులే ఎక్కువగా ఉంటారు. చాలా మందికి ఎకరా నుంచి ఐదెకరాల లోపు భూమి ఉంటుంది. ఈ రైతుల సమస్యలను చేపట్టడం ద్వారా సిపిఎం కొత్త ప్రాంతాల్లోకి విస్తరిస్తోంది. చిత్తశుద్ధితో చేసే పోరాటాల ద్వారా మేం రైతుల విశ్వాసాన్ని చూరగొనడం సాధ్యమైందని' ఆయన వివరించారు.
''పంజాబ్‌ తర్వాత అత్యధిక దళితులు ఉన్న రాష్ట్రం ఇది. దళితులపై సామాజిక, ఆర్థిక దోపిడీ పెచ్చరిల్లుతోంది. దానికి వ్యతిరేకంగా సిపిఎం పోరాడుతోంది. అంగన్‌వాడీ వర్కర్లతోపాటు స్కీమ్‌ వర్కర్ల పోరాటాలు కూడా మా దగ్గర ముఖ్యమైనవి. 1950వ దశకంలో కమ్యూనిస్టులు తీవ్ర పోరాటాల ఫలితంగా కనీసం భూసంస్కరణలు చేపట్టిన రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌. కాంగ్రెస్‌, బీజేపీ సహజంగా భూస్వామ్య వర్గానికి ప్రతినిధులు. వారి పాలనలో రైతులు, కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదు. సిపిఎం ఈ తరగతుల తరఫున బలమైన పోరాటాలు చేస్తోంది. ఇక్కడ పార్టీ విస్తరించటానికి చాలా అవకాశాలు ఉన్నాయి.'' అని వివరించారు.