విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కాములు) 2022-23 వార్షిక ఆదాయ అవసర నివేదికలను (ఎ.ఆర్.ఆర్) రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఎ.పి.ఇ.ఆర్.సి)కి డిసెంబరు 13న సమర్పించాయి. మూడు డిస్కాములకు కలిపి రూ.45,398.67 కోట్లు అవసరమని, ప్రస్తుత టారిఫ్, నాన్ టారిఫ్ ద్వారా రూ.35,353.06 మాత్రమే సమకూరుతుందనీ నికర ఆదాయ లోటు రూ.10,045.61 కోట్లుంటుందని పేర్కొన్నాయి. అయితే, ఎల్‌టి గృహ, వాణిజ్య వినియోగదారులపై కొత్త టారిఫ్ ద్వారా రూ.887.38 కోట్లు అదనపు భారం వెయ్యాలని ప్రతిపాదించాయి. డిస్కాములు సమర్పించిన ఎ.ఆర్.ఆర్ లపై ఎవరైనా తమ అభ్యంతరాలు, సూచనలు, సలహాలను జనవరి 13వ తేదీలోగా రాతమూలకంగా తెలియజేయాలని, వాటిపై జనవరి 24, 25, 27 తేదీల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తామని ఎ.పి.ఇ.ఆర్.సి ప్రకటించింది. ఎ.ఆర్.ఆర్ లలోని కొన్ని అంశాలు, వాటి వెనుక మర్మాన్ని గురించి చర్చిద్దాం.
గృహ వినియోగదారులపై భారం
డిస్కాములు ప్రస్తుతం ఉన్న శ్లాబులను మార్చుతూ గృహ వినియోగదారులపై భారీ వడ్డనను ప్రతిపాదించాయి. ఎ, బి, సి మూడు కేటగిరీలుగా ఉన్న వినియోగదారులను రెండుగా కుదించాయి. ఈ కేటగిరిల్లోనూ శ్లాబులవారీగా మార్పులు చేసి పేద, దిగువ మధ్యతరగతి వారిపై అదనపు భారం పడేలా, ధనికులకు తగ్గేలా ప్రతిపాదించడం గమనార్హం. ఉదాహరణకు ఎ కేటగిరి లోని 50 యూనిట్ల లోపు వినియోగదారులకు రూ.1.45 చొప్పున డిస్కాంలు వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు 50 యూనిట్ల విభాగానికి చెందిన వినియోగదారుడిని 30 యూనిట్లకే కుదించి మిగిలిన 20 యూనిట్లకు రూ. 2.80 చొప్పున వసూలు చేయనున్నాయి. ప్రస్తుతం 50 యూనిట్లకు వినియోగదారుడు రూ.72.50 చెల్లిస్తే, కొత్త ప్రతిపాదన వల్ల రూ. 99.50 చెల్లించాల్సి ఉంటుంది. ఇదే కేటగిరిలో 75 యూనిట్లు వినియోగదారులకు ప్రస్తుతం రూ.137.50 చెల్లిస్తుండగా కొత్త విధానం ప్రకారం రూ.169.50 చెల్లించాలి. అదే నెలకు వెయ్యి యూనిట్లు వాడేవారు ప్రస్తుతం రూ.8,170 చెల్లిస్తుండగా కొత్త ప్రతిపాదన ప్రకారం రూ.6,850 మాత్రమే చెల్లించాలి. అంటే సామాన్యులపై భారం, సంపన్నులకు రాయితీలన్నమాట.
ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వానికి చెందిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పిఎఫ్‌సి), గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ (ఆర్‌ఇసి) అధికారులు నెలకు 100 యూనిట్ల లోపు వాడే గృహ వినియోగదారులకు దేశంలోనే అతితక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్ లోనే ఇస్తున్నారనీ, చార్జీలు పెంచాలని సలహా ఇచ్చారని డిస్కాములు చెబుతున్నాయి. అంటే సామాన్యులకు విద్యుత్ చార్జీలు పెంచమని బిజెపి కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే వైసిపి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నమాట. చిన్న వ్యాపారులపై కూడా ఫిక్స్‌డ్ చార్జీల రూపంలో భారాలు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఎల్‌టి వాణిజ్య వినియోగదార్ల నుంచి వసూలు చేస్తున్న రూ.50 ఫిక్స్‌డ్ చార్జీలను రూ.75 లకు పెంచడంతోపాటు శ్లాబుల్లోనూ మార్పు చేసింది. మరోవైపు పరిశ్రమల విద్యుత్ వినియోగం పెంచాలన్న పేరుతో టైమ్ ఆఫ్ ది డే చార్జెస్ వంటి మాటల మాటున వారికి చార్జీలు తగ్గించాలని ప్రతిపాదించాయి. కాకుల్ని కొట్టి గద్దలకు వేయడమంటే ఇదే కదా! నిజానికి అధికాదాయ వర్గాలవారి నుండి ఎక్కువ చార్జీలు వసూలు చేసి, సామాన్యులకు చౌకగా సరఫరా చేసే క్రాస్ సబ్సిడైజేషన్ విధానం విద్యుత్ రంగంలో కొన్ని దశాబ్దాలుగా అమలు జరుగుతోంది. దాన్ని రద్దు చేయాలన్నది విద్యుత్ సంస్కరణల్లో ఒక ముఖ్యమైన షరతు. గతంలో ప్రపంచ బ్యాంకు చెప్పిందే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ చెబుతున్నాయి. అప్పుడు, ఇప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఒక ఇంటికి ఒకటే మీటర్
ఒక ఇంటికి ఒకే మీటరు నిబంధనను విద్యుత్‌శాఖ గుట్టుచప్పుడు కాకుండా అమలులోకి తీసుకువస్తోంది. డిపార్టుమెంటు నిబంధనల ప్రకారం ఒకే మీటరు ఉండాలని, అదనంగా ఉన్న మీటర్లను వారం రోజుల్లోగా రద్దు చేసుకోవాలని, అలా రద్దు చేసుకోకపోతే ఎటువంటి నోటీసులు లేకుండా ఆ ఇంటికి ఉన్న అన్ని సర్వీసుల కనెక్షన్లను తొలగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ప్రజానీకంపై ముఖ్యంగా అద్దెదారులపై పెను భారం పడుతుంది. అదనపు మీటర్లు రద్దు చేసుకోవాలంటూ అధికారులు ఇచ్చిన నోటీసులు కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చినప్పటికీ, మిగిలిన జిల్లాల్లో కూడా ఇదే తరహా కసరత్తు జరుగుతోంది.
అప్పులుాఆర్.డి.ఎస్.ఎస్
విద్యుత్ రంగంలో సంస్కరణల పేరుతో ప్రజల నెత్తిన భారాలు మోపేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన షరతులను రాష్ట్రప్రభుత్వం తుచ తప్పక అమలు చేస్తోంది. ఇప్పటికే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చిన ప్రభుత్వం ఇప్పుడు అన్ని కేటగిరీల విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లను అమర్చడానికి అంగీకారం తెలిపింది. ఇంధన శాఖ అధికారులు తీవ్రమైన కసరత్తు చేసి తమ ప్రతిపాదనలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కామ్‌లను ఆదుకునే పేరుతో రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్.డి.ఎస్.ఎస్)ను కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలుకు రూ.3,03,758 కోట్లను రాష్ట్రాలకు రుణంగా మంజూరు చేస్తానంది. అన్ని షరతులు సకాలంలో అమలు చేస్తే కొన్ని రాయితీలు, గ్రాంట్లు ఉంటాయని ఊరించింది. వినియోగదార్లందరికీ స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లను 2023 డిసెంబర్ నాటికి బిగించాలని ఒత్తిడి చేస్తోంది. వాటిని అమరిస్తే ఫోన్ నెట్‌వర్క్ వినియోగించకముందే బిల్లు ఎలా అయితే చెల్లిస్తున్నామో, విద్యుత్ బిల్లు కూడా అలానే ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. బిల్లు అయిపోయిన మరుక్షణమే ఆటోమేటిక్‌గా ఇంట్లో పవర్ పోతుంది.
ఆర్.డి.ఎస్.ఎస్ పథకంలో ఆటోమేటిక్ సబ్‌స్టేషన్ల (ఎస్.ఎ.ఎస్) ప్రతిపాదన కూడా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో ఉన్న 400 కెవి, 220 కెవి, 132 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్లలో ఎస్.ఎ.ఎస్ ను అమలు చేస్తోంది. ఎస్.ఎ.ఎస్ అమలు చేస్తే సబ్‌స్టేషన్లలో పనిచేసే సిబ్బంది భారీగా తగ్గుతారు. ఇప్పటికే సిబ్బంది కొరతతో విద్యుత్ ఉద్యోగులపై పనిభారం అధికంగా ఉంది. ఈ సంస్కరణల వల్ల తమపై మరింత భారం పడుతుందని విద్యుత్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులకు సేవలందించడంలోనూ ఇబ్బందులు తలెత్తవచ్చని అంటున్నారు.
జీవో 161 చిదంబర రహస్యం!
ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలతో నిమిత్తం లేకుండా టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాలని జీవో 161 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందనీ ఆ మేరకే సున్న రెవెన్యూ లోటును పేర్కొన్నామని డిస్కాములు తెలిపాయి. ఆ జీవోను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టలేదు కాని వేరే విధంగా అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జి.ఎస్.డి.పి లో 0.5 శాతం అదనపు రుణ పరిమితికి అనుమతి పొందడం కోసం 2021 నవంబర్ 15న జీవో 161 జారీ చేశారు. ఈ విషయాన్ని సదరు జీవో రిఫరెన్స్‌లో స్పష్టంగా పేర్కొన్నారు కూడా! రాష్ట్ర డిస్కాములు 2022-23 నుండి ఎఆర్‌ఆర్‌లను ప్రభుత్వ సబ్సిడీతో నిమిత్తం లేకుండానే ఎ.పి.ఇ.ఆర్.సి కి సమర్పించాలని ఆదేశించింది. అలాగే ఎ.పి.ఇ.ఆర్.సి టారిఫ్ ఆర్డర్ ఇచ్చినపుడు ప్రభుత్వ సబ్సిడీని ప్రత్యేకంగా పేర్కొనాలనీ కోరింది. అంటే ఇకపై విద్యుత్ సరఫరాకు ఎంత ఖర్చు అవుతుందో అంత మొత్తాన్ని చార్జీగా విధించే విధానానికి బాటలు వేస్తుంది. ప్రభుత్వ రాజకీయ అవసరాలనుబట్టి సబ్సిడీ ఇస్తుంది. భవిష్యత్తులో అలా ఇవ్వకపోతే వినియోగదారులే పూర్తిగా భరించాల్సి ఉంటుంది. అంటే పంప్‌సెట్లకు మీటర్లు బిగించి, బిల్లులు జారీ చేసి, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే డిస్కాములకు బదిలీ చేయడంవల్ల ప్రస్తుతానికి అది ఉచిత విద్యుత్తే. నగదు బదిలీ ఆగితే రైతు బిల్లు చెల్లించకపోతే పంప్‌సెట్‌కు కరెంటు కట్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం రాయితీలు పొందే తరగతుల వారికి ఇకపై అలాంటి గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది.
ట్రూఅప్ భారం
సాధారణంగా కొత్త ఛార్జీలు ఏప్రిల్ ఒకటి నుండి అమలులోకి రావలసి ఉండగా గృహ వినియోగ దార్ల చార్జీల పెంపు ఆగస్టు ఒకటి నుండి వర్తింపచేస్తామని డిస్కామ్‌లు ప్రతిపాదించడం విశేషం. ఇందుకు కారణాలను వివరించలేదు. వారి ప్రతిపాదన ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.887.38 కోట్లను ఆగస్టు నుండి ఎనిమిది నెలలపాటు నెలకు రూ.110.92 కోట్ల చొప్పున వసూలు చేస్తారు. ఆ కేటగిరీల వినియోగదార్లకు ఆ తరువాతి సంవత్సరం కూడా అవే చార్జీలు వసూలు చేసినా ఏడాది మొత్తం భారం రూ. 1,131.04 కోట్లు పడుతుంది. పొంచి వున్న ఒక ప్రమాదం మాత్రమే ఇది. ప్రజలపై భారాలు వేయడంలో మన డిస్కాముల తెలివితేటలు అమోఘం కదా! ఇంకేమైనా మతలబులున్నాయేమో తెలియదు.
శ్లాబుల మార్పుల షాక్‌తోపాటు వినియోగదారులపై ట్రూఅప్ భారం కూడా మోపనున్నాయి. ప్రజాసంఘాలు, వినియోగదారుల ఆందోళనతో రూ.3670 కోట్ల ట్రూ అప్ చార్జీలపై ఎ.పి.ఇ.ఆర్.సి వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా వీటిని కూడా డిస్కాంలు ఎఆర్‌ఆర్‌లో చూపించాయి. దీంతో పాటు 2021 ఆర్థిక సంవత్సరానికి మరో రూ.2480 కోట్లను ప్రతిపాదించాయి. మొత్తంగా రూ.6,165 కోట్ల ట్రూఅప్ భారాన్ని ప్రజలపై మోపేందుకు డిస్కాంలు ప్రతిపాదించాయి. ఈ ఏడాది మొత్తంగా 7,085 కోట్ల రూపాయల భారం మోపాలని ప్రతిపాదన.
ఆర్.డి.ఎస్.ఎస్ పథకాన్ని ఉపయోగించుకోవాలని ఆర్.ఇ.సి, పి.ఎఫ్.సి సి.ఎం.డిలు నవంబర్ 17న విజయవాడ వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిని, చీఫ్ సెక్రెటరీని కలిసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలోనే తొలిదశలో తమకు రూ.25 వేల కోట్లు కావాలని పి.ఎఫ్.సి, ఆర్.ఇ.సిలను రాష్ట్ర ప్రభుత్వాధికార్లు కోరినట్టు సమాచారం. అదనపు అప్పులు తీసుకోవడానికి కేంద్రం నుండి అనుమతి పొందడానికి జనంపై ఇప్పటికే ఆస్తి పన్ను, చెత్త పన్ను, పంప్‌సెట్లకు మీటర్లు తదితర భారాలు మోపిన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుదలకు, నిర్ణయించే విధానాల మార్పునకు సిద్ధమవుతోంది. విద్యుత్ రంగంలో వస్తున్న 'సంస్కరణలు', ఆ పేరుతో పడే భారాలనూ ప్రజలు అర్ధం చేసుకోవడం ఎంతో అవసరం. అప్పుడే వాటిని తిప్పికొట్టగలం.
బి. తులసీదాస్










