పరిగి : ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మెడలు వంచుదామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ పేర్కొన్నారు. ఏప్రిల్ 5న నిర్వహించే చలో ఢిల్లీకి సంబందించిన గోడపత్రికలను మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, రాము, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బత్తలపల్లి : కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏప్రిల్ 5న చేపట్టే చలో ఢిల్లీకి విజయవంతం చేయాలని కోరుతూ బత్తలపల్లి లోని నాలుగు రోడ్ల కూడలిలో జీపు జాతాను బుధవారం నిర్వహించారు. ఈ జీపు జాతా ధర్మవరం నుంచి,తాడిమర్రి, బత్తలపల్లి మీదుగా కొనసాగింది. నాలుగు రోడ్లు కూడలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు పోలా రామాంజనేయులు మాట్లాడుతూ చేనేత కార్మికులను ఆదుకోవాలన్నారు. రైతు సంఘం జంగాలపల్లి పెద్దన్న రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌హెచ్. బాషా, ఆదినారాయణ, మారుతి, పోతులయ్య తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప విమర్శించారు. ఏప్రిల్ 5న కార్మిక, కర్షక ఢిల్లీ పోరాట ప్రదర్శనకు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ మేరకు చలో ఢిల్లీకి సంబందించిన కరపత్రాలను సిఐటియు ఆధ్వర్యంలో ప్రజలకు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు జగదీష్, నాయకులు రామకృష్ణ, జబివుల్లా, మల్లికార్జున, చంద్ర, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.










