Feb 12,2022 08:02
  • ఎన్నికల రాష్ట్రాలకు యూరియా తరలింపు
  • జనవరిలో రాష్ట్రానికి 50 వేల టన్నులు కత్తెర

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియా సరఫరాలో కేంద్రం విధించిన కోతల మూలంగానే రబీ రైతులకు అదనుకు యూరియా అందట్లేదు. ఎన్నికల్లో లబ్ధి కోసం కేంద్ర బిజెపి సర్కారు యూరియా నిల్వలను ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలకు తరలించడంతో జనవరిలో మన రాష్ట్రానికి కావాల్సిన యూరియా సరఫరాకు భారీగా గండి పడిందని సమాచారం. జనవరి మాసానికి కేటాయించిన యూరియాలో దాదాపు 50 వేల టన్నులు అందలేదు. రబీ పంటల సాగు ముమ్మరంగా సాగుతున్న సమయంలో కేంద్రం నుండి తగినంత యూరియా సరఫరా జరగకపోయినా ఎపి ప్రభుత్వం నోరు మెదపలేదని విమర్శలొస్తున్నాయి. కేంద్రం కోతలకు తోడు గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బికె), సహకార సంఘాలపై అధికారపార్టీ పెత్తనం రైతులకు యూరియా దక్కనీయడంలేదని ఆరోపణ లొస్తున్నాయి. చాలా చోట్ల క్యూలైన్లలో గంటల తరబడి నిలబడి చివరికి యూరియా అందక రైతులు వెనుదిరుగుతున్నారు.
 

                                                                 నౌకల్లో ఎరువు

సాధారణంగా డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో రబీ పంటల సాగు జోరందుకుంటుంది. జనవరి అవసరాల రీత్యా 1.91 లక్షల టన్నుల యూరియాను కేంద్రం రాష్ట్రానికి కేటాయించగా జనవరి ముగిశాక కూడా పూర్తి స్థాయిలో సరఫరా కాలేదు. సుమారు 50 వేల టన్నులు రాలేదు. దేశంలో ఉత్పత్తి అయిన యూరియా నిల్వలను ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు ఆగమేఘాలపై కేంద్రం తరలించిందని చెబుతున్నారు. మన రాష్ట్రం దగ్గరకొచ్చేసరికి విదేశాల నుండి వచ్చే దిగుమతుల నుండి ఇస్తానంది. ఆ మేరకు 49 వేల టన్నులు ఫిబ్రవరిలో ఇచ్చిందంటున్నారు. ఇవన్నీ కాగితాలపై లావాదేవీలే. కేంద్రం దిగుమతి చేసుకున్న యూరియా కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం పోర్టుల్లో నౌకల్లో ఉంది. ఎపి తీర ప్రాంతంలో గల పోర్టుల్లో జరిగే ఎరువుల దిగుమతులపై ఎపి సర్కారు ఒక కన్నేస్తే రాష్ట్ర రైతులకు ఇంతగా ఎరువులు దొరకని పరిస్థితి దాపురించదని ప్రభుత్వ వర్గాలే ఘోషిస్తున్నాయి.
 

                                                               వైసిపి గుప్పెట్లోకి..

ఆర్‌బికేలే సర్వస్వం అని ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో నిజం లేదని వాటి నడకే చెబుతోంది. రబీకి అవసరమైన 9 లక్షల టన్నుల యూరియాలో ప్రారంభ నిల్వలలతో కలిపి పంపిణీకి సిద్ధం చేసింది 8.11 లక్షల టన్నులు. ఆర్‌బికెలలో అమ్మకానికి పెట్టింది 1.30 లక్షల టన్నులు మాత్రమే. పలు జిల్లాల్లో యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతుండగా ఆర్‌బికెలలో ఇప్పటి వరకు సేల్‌ అయింది 1.20 లక్షల టన్నులలోపే. ఆర్‌బికెలు కాకుండా కో-ఆపరేటివ్స్‌లో 63 వేల టన్నులు అమ్మకానికి పెట్టారు. ఆర్‌బికెలలో, సహకార సంఘాలలో తిష్ట వేసిన అధికారపార్టీ నేతలు, స్థానిక పెత్తందార్లు, భూస్వాములు వచ్చిన ఎరువును వచ్చినట్లు సిబ్బందిపై ఒత్తిడి చేసి తరలించుకుపోతు న్నారని ఆరోపణలొస్తున్నాయి. తమ కళ్ల ముందే ఎరువులను అందనీకుండా పక్కదారి పట్టించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.