కేంద్రం డీజిల్ దోపిడీకి రాష్ట్రం వత్తాసు.. సామాన్యుడిపై ఆర్‌టిసి ఛార్జీల పిడుగు
- రూ.720 కోట్లు కాదు.. రూ.1,800 కోట్ల భారం
కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసరంగా పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజానీకంపై పెనుభారం పడుతోంది. ప్రజలపై భారాలను మోపే కేంద్ర ప్రభుత్వ చర్యలను ఏమాత్రం ప్రశ్నించకపోగా, కేంద్రం ఏం చెబితే అది చేసేందుకు సిద్ధపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ భారాల విషయంలోనూ అదే వైఖరి అవలంభించింది.
ప్రజలకు ఎంతో కొంత ఊరట కల్పించడానికి బదులుగా డీజిల్, భద్రత సెస్ పేరుతో భారాన్ని మోపింది. ఇలా మోపిన భారం 720 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా. వాస్తవానికి అది రూ.1800 కోట్లు ఉంటుందని అంచనా! రూ.2 డీజిల్ సెస్ వల్ల రూ.720 కోట్లు, భద్రత సెస్ వల్ల రూ.360 కోట్లు, రౌండప్ చేసిన రూ.2 వల్ల మరో రూ.720 కోట్లు.. వెరసి ప్రయాణికులపై రూ.1,800 కోట్ల భారం పడిందని నిపుణులు చెబుతున్నారు.
పెనుభారం ఇలా...
డీజిల్ సెస్ పేరుతో ఒక్కో టిక్కెట్‌పై రూ.2 మాత్రమే పెంచుతున్నట్లు ఈ నెల 13న ఆర్‌టిసి హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్‌టిసి చైర్మన్ మల్లిఖార్జునరెడ్డి, ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. ఆ లెక్కన ఆర్‌టిసి సిటీ, ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులలో ఇప్పటి వరకు రూ.5గా ఉన్న కనీస చార్జీ రూ.7 కావాల్సి ఉండగా, దానిని రూ.10గా చూపించారు. ఇదే అంశాన్ని ప్రెస్‌మీట్‌లోనే ప్రశ్నిస్తే భద్రత సెస్ రూ.1 ఉందని, చిల్లర సమస్య తలెత్తకుండా ఉండేందుకు రూ.8ని రౌండప్ చేసి రూ.10 చేశామని అదనపు భారం మోపిన విషయాన్ని వెల్లడించారు. రూ.13 ఉన్న టిక్కెట్‌ను రౌండప్ చేసి రూ.15, రూ.18 ఉంటే రూ.20కి పెంచారు.
నెల తిరక్కుండానే..
నిజానికి డీజిల్ భారంపై రాష్ట్ర ప్రభుత్వం నెల తిరక్కుండానే మాట మార్చేసింది. సెస్ పేరుతో ఆర్‌టిసి బస్సు ఛార్జీలను పెంచడానికి సరిగ్గా నెల క్రితం ఆర్‌టిసి ఎమ్‌డి సిహెచ్ ద్వారకా తిరుమలరావు, అప్పటి రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)తో కలసి పెరిగిన డీజిల్ భారాన్ని తగ్గించేందుకు ప్రైవేటు బంకుల్లో డీజిల్‌ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల నెలకు రూ.65 కోట్లు చొప్పున ఏడాదికి రూ.780 కోట్లు ఆదా అవుతోందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం చెబుతున్న భారం రూ.720 కోట్లతో పోల్చితే ఇది ఏడాదికి 60 కోట్ల రూపాయలు ఎక్కువ! అయినా తాజా భారాన్ని ప్రభుత్వం మోపింది. రాష్ట్రంలో సుమారు 11,359 ఆర్‌టిసి బస్సులు రోజుకు ఎనిమిది లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాయి. గడచిన మూడేళ్లలో డీజిల్ ధర రూ.40 పెరగడంతో ఆర్‌టిసికి రూ.1,800 కోట్ల భారం పడిందని, మూడేళ్లలో చార్జీలను పెంచలేదని, అందుకే డీజిల్, భద్రత సెస్‌ను విధించినట్లు ప్రభుత్వ, ఆర్‌టిసి వర్గాలు చెబుతున్నాయి. ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల రూ.3,600 కోట్ల భారం పడినట్లు ఆర్‌టిసి వర్గాలు చెబుతున్నాయి. ఆ భారాన్ని కూడా ప్రజలపైనే రాష్ట్ర ప్రభుత్వం రుద్దింది.
దాసరి శ్రీనివాసరావు










