Apr 08,2022 22:21
  • రింగ్‌ రోడ్డు పేరిట ఇష్టానుసారంగా భూ సేకరణ
  • ప్రస్తుత ధరలకు అనుగుణంగా పరిహారమివ్వని వైనం
  • ప్రజల్లో చీలిక కోసమే 'కాశ్మీరీ ఫైల్స్‌'
  • జమ్మూ కాశ్మీర్‌ డివైఎఫ్‌ రాష్ట్ర నేత మహమ్మద్‌ అబ్బాస్‌

కన్నూరు (కేరళ) ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేయటం ద్వారా జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని తీసేసిన నేపథ్యంలో తాము అత్యంత సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నామని అక్కడి ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌) రాష్ట్ర నేత మహమ్మద్‌ అబ్బాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉద్యోగాలు, ఉపాధి లేక యువత తీవ్రమైన నిరాశా, నిస్పృహలకు లోనవుతున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది మానసికంగా కుంగిపోయి... ఆత్మహత్యలకు పాల్పడటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని యువతకు ధైర్యం తమ ముందున్న ఏకైక లక్ష్యమని వివరించారు. సిపిఎం 23వ అఖిల భారత మహాసభలో పాల్గనేందుకు ఇక్కడకు విచ్చేసిన ఆయన 'ప్రజాశక్తి'తో ముచ్చటించారు.

  • నిఘా నీడలో యువత

'ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లోని యువత తీవ్రమైన నిర్బంధాన్ని, అణచివేతను ఎదుర్కొంటున్నది. వారు తమ ఉద్యోగాలు, ఉపాధి, భవిష్యత్‌ గురించి బాహాటంగా ఏం మట్లాడినా, ప్రశ్నించినా కేంద్రంలోని బిజెపి వారిని టార్గెట్‌ చేస్తున్నది. మొబైల్‌ ఫోన్లు, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాలన్నింటిపై పోలీసు, సైన్యం నిఘా కొనసాగుతోంది. ఆఖరికి వ్యక్తిగత జీవితంపైనా ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో యువత మానసికంగా చితికిపోతుంది. మైనారిటీ యువకులు లక్ష్యంగా కేసులు బనాయించటం, జైళ్లకు పంపటం, వారి కుటుంబ సభ్యులను బెదిరించటం లాంటి చర్యలకు కేంద్రం పాల్పడుతున్నది...'

  • ఆపిల్‌ రైతులకు తీరని నష్టం...

'జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌తోపాటు పలు జిల్లాలను అనుసంధానించేందుకు వీలుగా కేంద్రం నిర్మించతలపెట్టిన రింగు రోడ్డు రాష్ట్రంలోని ఆపిల్‌ రైతులకు శాపంగా మారింది. పూర్తిగా వ్యవసాయం మీద, ఆపిల్‌ తోటల పెంపకం మీద ఆధారపడిన వారికి ఈ రోడ్డు నిర్మాణం మరణ శాసనం లిఖిస్తోంది. దీని కోసం సేకరిస్తున్న భూమికి 1996 ధరల ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామంటూ కేంద్రం చెబుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం పరిహారం ఇవ్వాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఇవేవీ ప్రభుత్వం చెవికెక్కటం లేదు. మరోవైపు ఎలాంటి పన్నుల్లేకుండా ఇరాన్‌ నుంచి ఆపిల్‌ పండ్లను దిగుమతి చేసుకోవటం వల్ల కాశ్మీర్‌ ఆపిల్‌ ధర అమాంతం పడిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు...'

  • ఎన్నికల్లో లబ్ధికే ఆ సినిమా ప్రచారం

'ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాపై చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఆ సినిమాలో అసలు నిజాలను తొక్కిపట్టారు. కాశ్మీర్‌ పండిట్లపై జరిగిన అఘాయిత్యాలను మనం ఖండించాల్సిందే. కానీ ఆ పేరిట ప్రజల మధ్య చీలికలు తెచ్చేందుకు బిజెపి ప్రయత్నించటం దారుణం. ఆ పార్టీ బహుశా త్వరలోనే జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించేందుకు ఆలోచిస్తుండవచ్చు. అందుకే ఈ సినిమాను ఇప్పటికిప్పుడు విపరీతమైన ప్రచారంలో పెట్టింది.'