విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం అనంతపురం జిల్లాలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఇది ప్రారంభమై నాలుగేళ్లు పూర్తయినా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. బడ్జెట్‌లో కేటాయింపులు అరకొరగానే ఉంటున్నాయి. దీంతో ఇప్పటికీ తాత్కాలిక భవనాల్లోనే విశ్వవిద్యాలయం కార్యకలాపాలు నడుస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవు. చదువు చెప్పే అధ్యాపకులూ లేరు. వీటి నడుమే గతేడాది మొదటి సంవత్సర బ్యాచ్ కూడా బయటకు వెళ్లింది.
నాలుగేళ్లుగా నిధులు అరకొరే...
ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని 2018లో అప్పటి మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రారంభించారు. జెఎన్‌టియు కళాశాల ఇన్‌క్యుబేషన్ కేంద్రంలోని తాత్కాలిక క్యాంపస్‌లో దీన్ని ప్రారంభించారు. త్వరలో శాశ్వత భవనాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం బుక్కరాయసముద్రం మండలంలోని జంతలూరు వద్ద 400 ఎకరాల భూమిని కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరంలో రూ.4.80 కోట్లు కేటాయించింది. 2021-22 సంవత్సరంలో రూ. 60.35 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. కాని సవరించిన బడ్జెట్‌లో దీన్ని రూ.20.11 కోట్లకు కుదించారు. 2022-23 సంవత్సరానికి కేవలం రూ.20.11 కోట్లు కేటాయించారు. నిర్వహణకు మాత్రమే నిధులు కేటాయించి వాటిని కూడా పూర్తి స్థాయిలో మంజూరు చేయలేదు.
వసతి లేదు...అధ్యాపకులూ లేరు...
ప్రస్తుతం ఏడు కోర్సులు నడుస్తున్నాయి. సుమారు 700 మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరికి తాత్కాలికంగా వసతిని అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఆ భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఇవీ అందరికీ సరిపోవడం లేదు. దీంతో బయట ఉండాల్సి వస్తోంది. పైగా పూర్తిస్థాయిలో అధ్యాపక నియామకాలు ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడున్న కోర్సులు, విద్యార్థులకు అనుగుణంగా అయితే 88 మంది అధ్యాపకులు ఉండాలి. కాని కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు. వారు కూడా అతిథి అధ్యాపకులుగానే బోధన చేస్తున్నారు. శాశ్వత నియామకాలు జరిగేది ఎన్నటికో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
రెండేళ్లుగా తరగతుల్లేవు
దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆఫ్‌లైన్ క్లాసులు నడుస్తున్నాయి. అయితే కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మాత్రం ఇప్పటికీ ఆన్‌లైన్ తరగతులే నడుస్తున్నాయి. 2018లో చేరిన మొదటి బ్యాచ్ ... ఆన్‌లైన్ విద్యతోనే ... కోర్సులు పూర్తి చేసుకుని గతేడాది బయటకు వెళ్లింది. వసతి గృహాల్లేని కారణంగానే క్లాసులు ఆఫ్‌లైన్‌లో పెట్టడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై గత నెలలో కొంత మంది విద్యార్థులు విశ్వవిద్యాలయంలో నిరసనలు సైతం చేపట్టారు.
/ ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి /
నిధులు కేటాయించాలి
కేంద్రీయ విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించాలి. ఇప్పటికే నాలుగేళ్లు పూర్తయ్యింది విశ్వవిద్యాలయం ఏర్పడినా...మౌలిక సదుపాయాల్లేక ఇక్కడ చదివేందుకు వస్తున్న విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సదుపాయాలు లేవనే ఉద్దేశంతో ఆన్‌లైన్ క్లాసులతోనే సరిపెడుతున్నారు. ఆఫ్‌లైన్ క్లాసులు కొనసాగించాలని వైస్ ఛాన్సలర్‌ను గతంలోనే కోరాం. సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి శాశ్వత ఏర్పాట్లు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి.
- డా|| గేయానంద్,
రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్.










