Feb 06,2023 20:04

కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే

కేంద్ర విద్యా శాఖ మంత్రికి ఎంపీ, ఎమ్మెల్యే వినతి
ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌ : రాయచోటికి కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కోరారు. సోమవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్‌లోని మంత్రిని వారు కలిసి వినతిపత్రం సమర్పించారు. నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ఉద్యోగులు నివాసాలు ఏర్పరచుకున్నారని తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థుల సౌకర్యం దృష్ట్యా కేంద్రీయ విద్యాలయం అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. స్థల సేకరణ కూడా పూర్తయిందని, ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోగా రాయచోటిలో కేంద్రీయ విద్యాలయం ప్రారభించాలని మంత్రిని కోరారు. మదనపల్లెలో కూడా కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని, ఈ రెండింటినీ మంజూరు చేసి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మీ చేతులమీదుగానే ప్రారంభించాలని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు.