Feb 25,2022 06:57

    తాజాగా కాగ్‌ నివేదిక ఆసక్తికర అంశాలను బయట పెట్టింది. ఐఐటి, ఎన్‌ఐటి లలో పి.జి, పిహెచ్‌డి కోర్సుల్లో ఏటా సీట్లు భారీగా మిగిలిపోతున్నాయని వెల్లడించింది. బిటెక్‌ తోనే మంచి ఉద్యోగాలు వస్తుండటంతో ఎక్కువ మంది విద్యార్థులు పి.జి, పిహెచ్‌డి వైపు మొగ్గు చూపడం లేదు. అలాగే బిటెక్‌ లోని కొన్ని కోర్సుల్లోనూ సీట్లు భర్తీ కావడం లేదు. ఈ సమస్య ప్రధానంగా కొత్త ఐఐటీల్లో కనిపిస్తోందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికలు వెల్లడిస్తున్నాయి.
    కాగ్‌ నివేదిక ప్రకారం గత రెండేళ్లలో ఐఐటీల్లో వివిధ కోర్సుల్లో 10,780 సీట్లు, ఎన్‌ఐటి లలో 8,700 సీట్లు మిగిలిపోయినట్లు కాగ్‌ పేర్కొంది. 2020-21 విద్యా సంవత్సరంలో ఐఐటి ల్లో 5,484 సీట్లు భర్తీ కాలేదు. వీటిలో బిటెక్‌ కోర్సుల సీట్లు 476 ఉండగా పీజీ కోర్సుల సీట్లు 3,229 ఉన్నాయి. అలాగే పిహెచ్‌డి కోర్సుల్లో 1,779 సీట్లు భర్తీ కాలేదు. కొత్త ఐఐటీ లైన భువనేశ్వర్‌, గాంధీనగర్‌, హైదరాబాద్‌, ఇండోర్‌, జోధ్‌పూర్‌, మండి, పాట్నా, రోపార్‌ల్లో సీట్లు ఎక్కువ మిగిలిపోయాయి. 2021-22లో అన్ని ఐఐటీ ల్లో 5,296 సీట్లు భర్తీ కాలేదు. వీటిలో బిటెక్‌ కోర్సుల్లో 361 సీట్లు, పి.జి కోర్సుల్లో 3,083 సీట్లు, పీహెచ్‌డీ కోర్సుల్లో 1,852 సీట్లు ఖాళీగా మిగిలిపోయినట్లు కాగ్‌ పేర్కొంది. దీనిపై విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు. ఇలాగే కొనసాగితే పలు అంశాల్లో కోర్సులను ఎత్తేయాలని చెబుతున్నారు. కేంద్ర విద్యాసంస్థలలో సీట్లు మిగిలిపోతుంటే ఇక సాధారణ కళాశాల పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు.
    మరోవైపు ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో బిటెక్‌ పూర్తికాగానే విద్యార్థులు మంచి ఉద్యోగాలకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉన్నత విద్య ప్రాధాన్యత తగ్గింది. బిటెక్‌ ఉత్తీర్ణతతోనే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో మంచి ఉద్యోగాలు దక్కుతుండటంతో పి.జి, పిహెచ్‌డి లలో చేరడానికి విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు. కాగ్‌ నివేదిక ప్రకారం. అర్హత గల అభ్యర్థులు లేకపోవడం వల్ల పీహెచ్‌డీ సీట్లు భర్తీ చేయలేకపోతున్నట్లు ఆయా ఐఐటీలు పేర్కొన్నాయి. టాప్‌ ఐఐటీల్లో ఒకటైన ఢిల్లీలో 800 పిహెచ్‌డి సీట్లు ఉండగా కేవలం 500 మాత్రమే భర్తీ అవుతున్నాయి. అనంతపురంలో వెలసిన కేంద్ర విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టిన ఎంటెక్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ కోర్సులో ఒక్క విద్యార్ధి చేరలేదు.
    ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో పరిశోధన పడకేసి దశాబ్దం అవుతుంది. ప్రతి సంవత్సరం నిర్వహించాల్సిన రీసెట్‌ ఎంట్రన్స్‌ పరీక్ష మూడు సంవత్సరాల కొకసారి నిర్వహిస్తూ ఇంటర్వ్యూలు అడ్మిషన్లకు సంవత్సరం తీసుకుంటున్నారు. చాలా విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులు లేక విభాగాలు మూసివేశారు. ఉన్న అరకొర అధ్యాపకులు డైరెక్టర్లుగా, ప్రిన్సిపాల్‌, రిజిస్ట్రార్‌, రెక్టార్లు, వి.సి లు గా చలామణి అవుతున్నారు. మరోవైపు గత ఆరు సంవత్సరాలుగా రీసెర్చి గ్రాంట్లు, మైనర్‌, మేజర్‌, ఉమెన్‌ సైన్టిస్ట్‌, స్టార్ట్‌ అప్‌ గ్రాంట్లు, సీడ్‌ గ్రాంట్లకు డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ నివేదికలను యుజిసి, ఎఐసిటిఇ కి సమర్పించనేలేదు. పరిశోధనలకు నయాపైసా ఇవ్వకుండా, కొత్త అధ్యాపకుల నియామకాలు చేపట్టకపోతే రాబోయే రెండు మూడు సంవత్సరాలలో విద్యా సంక్షోభం వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా లోపం ఎక్కడుందో గ్రహిస్తే మంచిది.
 

- డా|| యం. సురేష్‌ బాబు