Apr 17,2023 21:08

కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న నాయకులు

మదనపల్లె : త్యాగాలు భలిదానాలతో ఏర్పాటు చేసిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ విరమించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈశ్వ రయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్‌ చేశారు. సోమవారం ఎఐటియుసి రాష్ట్ర సమితి పిలుపు మేరకు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ వ్యతిరేకంగా మదనపల్లి మున్సిపల్‌ కార్యాలయం చర్చి వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వీరికి సిపిఎం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై కత్తిగట్టిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరో వంచనకు పాల్ప డిందని పేర్కొన్నారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగర్‌ సింగ్‌ కులస్తే విశాఖ ఉక్కుపై పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో ఇస్తున్నారని వాపో యారు. స్టీల్‌ ప్లాంటు గొంతు నులిమి కేంద్రం హత్య చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ మిన్నకుండడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర ప్రజలను గందరగోళ పరచడానికే పార్లమెంటులో ఒక్కోసారి ఒక్కో ప్రకటన బీజేపీ ప్రభుత్వం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను ఆపడానికి రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలతో అఖిలపక్షం వేసి కేంద్రంతో పోరాటానికి సిద్ధపడాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు టి.హరేంద్రనాథ్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.ఎల్‌.నరసింహులు, జిల్లా సహాయ కార్యదర్శి మహేష్‌, ఎఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి సురేష్‌ కుమార్‌, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కష్ణప్ప పాల్గొన్నారు.