- పథకాల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల కోసమే : తేల్చి చెప్పిన ఆర్థికశాఖ
- ప్రతి త్రైమాసికానికి 35 శాతమే వ్యయం
- తొమ్మిది నెలల్లో 75 శాతమే పరిమితి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : కేంద్ర ప్రయోజిత పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వచ్చిన తరువాతే రాష్ట్రానికి సంబంధించిన వాటా నిధులు జమ చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ నిర్ణయించింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో తీవ్ర జాప్యం నెలకొంటున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఒక పథకానికి ఎంత నిధులు అవసరమో గుర్తించి రాష్ట్రం, కేంద్ర వాటాలను కేంద్రం ఖరారు చేస్తుంది. రాష్ట్రం కూడా తన వాటా నిధులను ఒకేసారి విడుదల చేయాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి నిధులు సకాలంలో రాకపోవడం ఒక కారణమైతే, రాష్ట్రం తన వాటా నిధులను సకాలంలో విడుదల చేయలేకపోవడం ఇంకో కారణంగా అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆర్థిక శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో కేంద్ర నిధులు వచ్చిన తరువాతే రాష్ట్ర వాటా నిధులకు బిఆర్‌ఓ (బడ్జెట్ రిలీజ్ ఆర్డర్)లు విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఈ పథకాల నిర్వహణలో భాగస్వామ్యమయ్యే ఉద్యోగులకు జీతాల సమస్య రాకుండా నివారించేందుకే ఈ నిర్ణయమంటూ ఆర్థిక శాఖ తేల్చిచెప్పింది. ఇప్పటివరకు కేంద్రం నుంచి నిధుల రాకలో జాప్యం కారణంగానే ఉద్యోగులకు జీతాలు సక్రమం గా రావడం లేదని పేర్కొంది. కేంద్ర పథకాలకు సింగిల్ నోడల్ ఏజెన్సీ పేరున ఒకే బ్యాంకు ఖాతా ఉండాలని, అది కూడా కేంద్రం ఆధీనంలోని పిఎఫ్‌ఎంఎస్‌కు అనుసంధానం చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. అప్పటి నుంచే ఈ సమస్య ఉత్పన్నమైనట్లు రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. అందుకే ప్రతి నెలా 10వ తేదీలోగా ఎస్‌ఎన్‌ఎ ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేసి ఖజానా ద్వారా 15లోగా జీతాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
త్రైమాసిక లక్ష్యాలు
శాసనసభలో ఆమోదించిన బడ్జెట్‌లో మొత్తాన్ని వంద శాతం దాటకుండా నాలుగు త్రైమాసికాల్లో వినియోగించాలని నిర్దేశించారు. ఒక ప్రధాన పద్దు ద్వారా ఒక త్రైమాసికంలో 35 శాతానికి మించి వ్యయం చేయరాదని పేర్కొన్నారు. మూడో త్రైమాసికం నాటికి మొత్తం బడ్జెట్‌లో 75 శాతం దాడకూడదని స్పష్టం చేశారు.










