కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మొండిచేయి చూపడంపై జిల్లాలో గురువారం నిరసనలు వ్యక్తమయ్యాయి. సిపిఎం, సిఐటియు, ఎపి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి డౌన్‌డౌన్, కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలి, కడప-బెంగళూరు రైల్వేలైన్‌కు నిధులు కేటాయించాలి, రాష్ట్రానికి నిధులు పెంచాలని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమం ఉదృతం
ప్రజాశక్తి-కడప అర్బన్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రజలను నిరాశకు గురిచేసిందని, విభజన చట్టం హామీలను తుంగలో తొక్కిందని ఉక్కు సాధన ఐక్యవేదిక అధ్యక్షులు బి.నారాయణ విమర్శించారు. గురువారం అంబేద్కర్ సర్కిల్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమకు, వలసలు కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఉద్యోగ ఉపాధి కల్పించే ఉక్కు పరిశ్రమ ఆవేదన వ్యక్తం చేశారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై హామీ ఇచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతున్న ఏర్పాటుకు ప్రయత్నాలే చేయకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కేంద్ర బడ్జెట్ బాగుందని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. రాయలసీమ, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. దీనికోసం ఉద్యమాలను ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం ఐక్యవేదిక నాయకులు సత్తార్, గుర్రప్ప, సిఆర్‌వి ప్రసాద్, పాపిరెడ్డి, ఎమ్మార్ నాయక్, రాజేంద్రప్రసాద్, ఓబులేసు, సురేష్ నాయక్, అంజి, జితేంద్ర పాల్గొన్నారు.
వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారాలు చూపని కేంద్ర బడ్జెట్
బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి నిధులు తగ్గిస్తే రైతుల ఆదాయం ఏ రకంగా రెట్టింపు అవుతుందని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్ ప్రశ్నించారు. గురువారం పాత బస్టాండ్‌లో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి నిధులు తగ్గించి సంక్షోభం ఏ రకంగా నివారిస్తారని తెలిపారు. పిఎం కిసాన్ పథకం కింద రూ.6 వేలు ఇస్తున్నారని, ఇది ఏ మాత్రం చాలడం లేదన్నారు. వ్యవసాయ సాగు ఖర్చులు రెట్టింపు అయ్యాయని, బడ్జెట్‌లో పిఎం కిసాన్ పథకం పథకాన్ని కూడా రెట్టింపు చేయాలని పేర్కొన్నారు. లక్షలాది మంది రైతులు ఆత్మహత్య పరంపర కొనసాగుతూ ఉందరి చెప్పారు. మద్దతు ధరలను ఇస్తామని ప్రకటించిన మోడీ ఆ ఊసే లేదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఐసిడిఎస్, మధ్యాహ్న భోజన పథకాలకు కేటాయింపులు పెంచలేదని విమర్శించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణయ్య, సిఐటియు నగర అధ్యక్షులు చంద్రారెడ్డి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సుంకర రవి, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
అల్ప సంఖ్యాక వర్గాల వ్యతిరేక బడ్జెట్ : సిపిఎం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక, నిరుద్యోగ, రైతు, అల్ప సంఖ్యాక వర్గాల వ్యతిరేక బడ్జెట్‌గా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ విమర్శించారు. గురువారం సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గడిచిన ఎనిమిదేళ్లుగా మాటలతో ప్రజలను మభ్యపెడుతోందన్నారు. కాగితాలలో బడ్జెట్ పెరిగిందని, ప్రజల నిజజీవితంలో కొనుగోలు శక్తి బాగా బలహీన పడిందని తెలిపారు. బడ్జెట్ వాస్తవ పరిస్థితులను వక్రీకరించే విధంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు లేవని, పోలవరం, రాజధాని, రైల్వే అభివృద్ధికి నిధులు లేకపోయినా, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం ప్రస్తావన చేయకపోయినా రాష్ట్రంలోని వైసిపి జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసిస్తూ పత్రికా ప్రకటన చేస్తుండటం సిగ్గుచేటన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసే విధంగా ఉందని చెప్పారు. వైసిపి ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందని తెలిపారు. సిఎం సొంత జిల్లాలో పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గాలలో వైసిపిలోని విభేదాలు బహిర్గతమయ్యాయయన్నారు. 2024 జిల్లా ఎన్నికలకు నిధులు సమకూర్చుకోవటానికే షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి రూ.36 వేల కోట్ల కాంట్రాక్టులు ప్రభుత్వం ఇచ్చిందని జిల్లాలోని అధికార పార్టీ నాయకులే చెప్తున్నారని తెలిపారు. సిపిఎం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను వ్యతిరేకిస్తూ ప్రజా చైతన్య కార్యక్రమాలు, ప్రజా ప్రతిఘటన ఉద్యమాలు నిర్వహిస్తుందని హెచ్చరించారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రామమోహన్, జిల్లా కమిటీ సభ్యులు అన్వేష్, దస్తగిరిరెడ్డి పాల్గొన్నారు.
విద్యా రంగం పట్ల నిర్లక్ష్యం : ఎస్‌ఎఫ్‌ఐ
విద్యా రంగం పట్ల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిర్లక్ష్యం వహించిందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం.ఆర్.నాయక్ విమర్శించారు. విద్య కోసం వాటా 2022-23 బడ్జెట్ అంచనా మొత్తంలో 2.64 శాతం నుంచి బడ్జెట్ అంచనాలో 2.50 శాతానికి క్షీణించిందని తెలిపారు. బడ్జెట్‌లో విద్యకు జిడిపిలో 3 శాతం కూడా హామీ ఇవ్వలేదని తెలిపారు. ఇది కొత్త విద్యా విధానంలో వాగ్దానం చేసిన దానిలో సగం మాత్రమే. జాతీయ విద్యా మిషన్‌కు బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయించారని చెప్పారు.
'ఉక్కు'ను మరచిన కేంద్రం : డివైఎఫ్‌ఐ
ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్): కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కును విస్మరించడం దారుణమని స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు డేవిడ్ రాజ్, ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విభజన హామీలను విస్మరించిందని అందులో ప్రధానంగా కడప ఉక్కు పరిశ్రమను నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. ఉక్కుకు నిధులు కేటాయిస్తారని జిల్లా ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులకు ఆశగా ఎదురు చూసారని వారికి ప్రతి సారి నిరాశే ఎదురు అవుతుందన్నారు. కడప ఉక్కుకు నిధులు కేటాయించాలని లేని పక్షంలో పోరాటాలు సాగిస్తామని, ఈ పోరాటంలో యువత, విద్యార్థులు కలసి రావాలి అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సురేశ్ నాయక్, అజరు, రాహుల్, ఉదరు పాల్గొన్నారు. కడప అర్బన్ : కేంద్ర బడ్జెట్‌లో కడప ఉక్కుకు నిధులు కేటాయించకుండా బిజెపి ప్రభుత్వం విస్మరిస్తుందని డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి.ఎం.ఓబులేసు విమర్శించారు. పూలే సర్కిల్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విభజన హామీలను విస్మరించిందన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నగర ఉపాధ్యక్షులు విజరు, నాయకులు యూసఫ్, జగదీష్, శ్రీకాంత్ చిన్న, నవీన్, మణి, గౌస్ పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేక బడ్జెట్
జమ్మలమడుగు రూరల్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల, నిరుద్యోగ, కార్మిక వ్యతిరేక బడ్జెట్ అని సిపిఎం జమ్మలమడుగు కార్యదర్శి వీరనాల శివ నారాయణ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి, రాయలసీమకు, కడప ఉక్కుకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ సిపిఎం అధ్వర్యంలో పాత బస్టాండ్ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపి అనంతరం బడ్జెట్ ప్రతులను దగ్దం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నులకు అనుకూలంగానే వున్నదన్నారు. ప్రథమంగా రాష్ట్రానికి, రాయలసీమకు తీరని అన్యాయం చేశారన్నారు. కడప ఉక్కుకు బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటే కేంద్రానికి కడప ఉక్కుపై ఉన్న చిత్తశుద్ది అర్థం అవుతున్నదన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, నాయకులు దాసు, రవి, రఘు, మన్సూర్ పాల్గొన్నారు.
ఎపికి టోపీ పెట్టిన కేంద్రం : పిసిసి
వేంపల్లె : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టోపీ పెట్టిందని పిసిసి మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. గురువారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతుల, గ్రామీణుల, పేదల, నిరుద్యోగుల వ్యతిరేక బడ్జెట్ గా మారిందని చెప్పారు. అప్పుల మీద ఆధారపడ్డ బడ్జెట్‌గా ఉందని చెప్పారు. దేశ జనాభాలో 70 శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని కాని కేంద్ర బడ్జెట్‌లో 2.77 శాతం మాత్రమే వ్యవసాయ రంగానికి కేటాయించడం దురద ష్టకరమని అన్నారు. ఎరువుల సబ్సిడీలో ఒకేసారి రూ.50,120 కోట్లు కోత కోయడం శోచనీయమని చెప్పారు. గ్రామీణాభివృద్ధి కేటాయింపులో రూ.5013 కోట్లు కోత కోయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆహార సబ్సిడీలో ఒకేసారి రూ.89844 కోట్లు భారీ కోత విధించడం గర్హనీయమని చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో నిరుద్యోగుల ప్రస్తావనే లేదన్నారు. ఇప్పటికే దేశం అప్పులకుప్ప అయిందనన్నారు. 2023-24లో రూ.15.40 లక్షల కోట్లు కేంద్రం అప్పు చేస్తుందని చెప్పడం జరిగిందని చెప్పారు. మొత్తం బడ్జెట్‌లో అప్పులు 34 శాతం ఉందని చెప్పారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని చెప్పారు. ప్రత్యేక హోదా ప్రస్తావన లేక పోవడంతో పాటు రైల్వే జోన్ ఊసే లేదని చెప్పారు. పోలవరాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ, కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేదన్నారు.
జగన్ రాజీనామా చేయాలి
కడప: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరగడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేతకానితనం ఎక్కువగా ఉందని, దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ డిమాండ్ చేశారు. గురువారం డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగితే ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. బడ్జెట్ విడుదల కాకముందే ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ బాగుందనడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, కడప జిల్లా కోఆర్డినేటర్ హరి ప్రసాద్, రాష్ట్ర నేతలు ప్రభాకర్, నజీర్ అహ్మద్, బండి జకరయ్య, సత్తార్, జోడు నాగరాజు, తిరుమలేష్, అలీ ఖాన్, ఆరీఫుల్లా, శ్యామలాదేవి, చెప్పలి పుల్లయ్య, గొర్ల శ్రీనివాసులు, మీడియా కోఆర్డినేటర్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గౌడ్, నాసిర్ ఖాన్, సాదిక్, గౌరీ, వంశి, సమీరా పాల్గొన్నారు.










