Feb 03,2023 21:07

రాస్తారోకో నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు

 రాయచోటి టౌన్‌ : ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ రాయచోటి పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం సర్కిల్‌ లో కొత్తపేట రోడ్డులో సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. బడ్జెట్‌ ప్రతులను దగ్ధం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లా డుతూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో పవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్ర,, దేశ ప్రజలను మరోసారి దగా చేశారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వే ప్రాజెక్టుల ఊసే ఎత్తలేదన్నారు. వెనుకబడిన జిల్లాల అభివద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనేలేదని చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపులేదని మండిపడ్డారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి నిధుల ఊసేలేదని వాపోయారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు పెంచ కపోగా నిర్వాసితులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఆహారం, ఎరువులు, వంటగ్యాస్‌ సబ్సిడీలో కోత పెట్టి పేదలు, రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా బడ్జెట్‌ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ఉపాధి హామీని ప్రవేశపెట్టకపోగా, గ్రామీణ ఉపాధి హామీకి రూ.30 వేల కోట్ల మేర మోడీ ప్రభుత్వం కోత విధించిందని తెలిపారు. రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించకపోవడం సరికాదన్నారు.