Jul 12,2021 15:12

న్యూఢిల్లీ : భారత్‌లో నూతన ఐటి నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటి నుండి సోషల్‌ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్‌ చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ నిబంధనలను వ్యతిరేకించడంతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ప్రముఖుల ట్విట్టర్‌ ఖాతాలను నిర్ధారించే బ్లూ టిక్‌ మార్కులను తొలగిస్తూ విమర్శలపాలైంది. తాజాగా ఇదే చర్యను పునరావృతం చేసింది. నూతన ఎలక్ట్రానిక్స్‌, సమాచార, సాంకేతిక సహాయ మంత్రి రాజీవ్‌ చంద్ర శేఖర్‌ సంబంధించిన ట్విట్టర్‌ ఖాతాను నిర్ధారించే బ్లూ టిక్‌ బాడ్జీని తొలగించింది. ఇటీవల కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో భాగంగా కర్ణాటకకు చెందిన బిజెపి నేత చంద్రశేఖర్‌ ఐటి శాఖ సహయ మంత్రిగా నియమితులయ్యారు. తన ట్విట్టర్‌ ఖాతాకు సంబంధించిన బ్లూటిక్‌ బాడ్జీని ఎందుకు తొలగించిందో ఆయన వెల్లడించలేదు. గతంలో ప్రముఖల ఖాతాలకు బ్లూటిక్‌ను కాసేపు నిలిపివేసినప్పటికీ...తర్వాత పునరుద్ధరించగా...చంద్రశేఖర్‌ విషయంలో ఏం చేస్తుందో చూడాలి.