కెఆర్‌ఎంబి పరిధిని నిర్దేశించాలి.. ప్రాజెక్ట్‌లకు సిఐఎస్‌ఎఫ్ భద్రత కల్పించాలి : విజయసాయి రెడ్డి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్ట్‌లకు సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కెఆర్‌ఎంబి) పరిధిని స్పష్టంగా నిర్దేశించాలని వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి కోరారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను ఆయన నివాసంలో శుక్రవారం కలిశారు. అన్ని ప్రాజెక్టులకు సిఐఎస్‌ఎఫ్ బలగాలతో భద్రతను కల్పించి చట్టం ప్రకారం వ్యవహరించేలా చూడాలని మంత్రిని కోరారు. కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న చట్ట వ్యతిరేక విధానాలను మంత్రికి వివరించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం గురించి మంత్రితో చర్చించి, నిర్మాణానికి అనుమతించవలసిందిగా కోరారు. ఈ విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు విజయసాయి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాల ఆధారంగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల విస్తరణ, శ్రీశైలం ఎడమ కాలువ విస్తరణ ఏ విధంగా చట్ట విరుద్ధమైనవో మంత్రికి వివరించినట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం నుంచి విశాఖ జిల్లా నరవ వరకు పైపు లైన్ ద్వారా విశాఖ జిల్లాకు తాగు నీటిని తరలించే రూ.3,573 కోట్ల ప్రాజెక్ట్ వ్యయంలో సగం భారాన్ని కేంద్రం భరించాలని కోరామన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు.










