చాపాడు :కెపి ఉల్లి రైతులకు ప్రతి సంవత్సరం కష్టాలు తప్పడంలేదు. కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైకరికి కెపి ఉల్లి రైతు కంట కన్నీరుబుకుతోంది. ఉల్లిని కోస్తే కన్నీళ్లు కారటం సహజం. అయితే కెపి ఉల్లిని పండిస్తేనే కన్నీళ్లొ స్తున్నాయని రైతులు వాపోతున్నారు. కెపి ఉల్లి అని పిలిచే క్రిష్ణాపురం ఉల్లి అరుదైన రకం. ఎగుమతులకే ఉద్ధేశించిన రకమిది. 75 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన ఈ పంటను పండించే రైతులంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం చిన్నచూపుచూస్తోంది. రైతులు పండించిన ఉల్లిని మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసి ప్రయివేటు ఏజన్సీల ద్వారా విదేశాలకు ఎగుమతి చేయాల్సి ఉంది. ప్రధానంగా కెపి ఉల్లిని శ్రీలంక, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, బ్రూనై, పోర్ట్‌కెలాంగ్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రభుత్వ అలసత్వం వల్ల ఏటా కెపి ఉల్లి రైతులు నష్టపోతూనే ఉన్నారు. మార్క్‌ఫెడ్ కొనుగోలు చేయకపోవడంతో ప్రయివేటు వ్యాపారులు రంగప్రవేశం చేసి రైతులను దోపిడీకి గురిచేస్తున్నారు. కెపి ఉల్లి రైతులు అన్యాయానికి గురికాకుండా ఉండాలంటే మైదుకూరులో శాశ్వత కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు 35 ఏళ్లుగా రైతులు ఉద్యమబాట పట్టారు. ప్రభుత్వంలో చలనంలేదు. రైతులు ఆందోళనలు చేసుకోవాల్సిందే తప్ప కొనుగోలు కేంద్రంను తెప్పించడంలో ప్రజాప్రతినిధులు కూడా విఫలమయ్యారు. ఎన్నికల సమయంలో నాయకులు మాత్రం హామీలు గుప్పిస్తుంటారు. ఆ తర్వాత మాట మరుస్తుంటారు.
ఎగుమతులపై కేంద్రం నిషేదం
ఉల్లి ధరలు పెరిగిన సందర్బాలలో అన్ని రకాల ఉల్లిపాయల ఎగుమతులు నిషేదం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేస్తున్నది. రైతుల నుంచి అభ్యర్థనలు వచ్చిన తరువాత ఎగుమతులపై నిషేధం తొలగిస్తున్నారు. అన్ని రకాల ఉల్లిపై ఆంక్షలు కొనసాగనున్నాయని ప్రకటించిన సందర్భంంలో స్ధానికంగా అమ్మకం కాని విదేశి రకం కెపి ఉల్లి పండించే రైతుల్లో ఆందోళన మొదలవుతున్నది. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు రెక్కలు వచ్చినవేల కేంద్రం దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటుంది. దేశీయ మార్కెట్లో ఉల్లి లభ్యత పెంచడం ఉల్లి ధరను నియంత్రించే లక్ష్యంగా ఈ నిషేధం విధిస్తున్నారు. డిజిఎఫ్‌టి డైరెక్టర్ జనరల్ (ట్రేడ్) నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రతి సారి రైతుల్లో ఆందోళన చెందుతున్నారు. ఉల్లి పండించిన రైతులు పంటను అమ్ముకునేందుకు మాత్రం నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఈ సమష్య తొలగాలంటే కెపి ఉల్లి ఎగుమతులపై శాశ్వతంగా నిషేధం ఎత్తివేయాలి.
దోపిడీకి గురవుతున్న రైతులు
ప్రతి సంవత్సరం కెపి ఉల్లి రైతులు ప్రయివేటు వ్యాపారుల దోపిడీకి గురవుతున్నారు. ఉల్లిని మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేయాల్సి ఉంది. గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళనకు దిగినప్పుడు మాత్రం మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగి కొనుగోళ్లు చేస్తుంది. ఆ తర్వాత అడ్రస్‌లేకుండా పోతుంది. రెండు సంవత్సరాలుగా మార్క్‌ఫెడ్ ఉల్లిని కొనుగోలు చేయడంలేదు. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రయివేటు వ్యాపారులు తమకు అవసరమైన మేరకు మాత్రమే ఉల్లిని కొనుగోలు చేస్తారు. రెండవ రకాన్ని కొనుగోలు చేయరు. బయట ఈ ఉల్లిని అమ్ముకునేందుకు రైతులకు వీలుకాదు. మార్క్‌ఫెడ్ అయితే రైతుల నుంచి ప్రతి గడ్డను కొనుగోలు చేస్తుంది. అప్పుడు రైతులు కొంత మేరకు లాభపడేందుకు వీలుంటుంది. మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే రైతులకు మంచి గిట్టుబాటు ధర కూడా లభించే అవకాశం ఉంది. ఉల్లినే వ్యాపారంగా మార్చుకున్న కొందరు వ్యాపారులు ఎలాగైనా ఎక్కువ ధర చెల్లించి ఉల్లిని కొనుగోలు చేసేందుకు వీలుంటుంది.
తగ్గుతున్న ఉల్లి విస్తీర్ణం
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏడాదికేడాది కెపి ఉల్లి సాగు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ప్రతి సంవత్సర 15 వేల ఎకరాల్లో సాగయ్యే ఉల్లి ఇప్పుడు ఐదు వేల ఎకరాలకు పడి పోయింది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకనే ఈ పంట సాగు పడి పోయింది. కడప జిల్లాలోని మైదు కూరు, దువ్వూరు, ఖాజీపేట, బ్రహ్మం గారిమఠం, కలస పాడు, పోరుమామిళ్ల మండలాలతో పాటు కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ, చాగలమర్రి, ప్రకాశం జిల్లాలోని గిద్ద లూరు ప్రాంతాల్లో ఈ రకం పంటను సాగు చేస్తారు. శాశ్వత కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతుల్లో సాగుపై ఆసక్తి తగ్గిపోతోంది.
అమ్మకం కష్టంగా మారుతోంది
కెపి ఉల్లి పంటను నూర్పిడిచేసిన తరువాత అమ్మకాలు చెపడదామంటే కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. ఉల్లి పంట ఎన్నో ఏళ్లుగా సాగు చేపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించిన సందర్బంలో అమ్మకం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ప్రభుత్వం మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి. - రామసుబ్బారెడ్డి రైతు, దువ్వూరు.
శాశ్వత కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
కెపి ఉల్లి మన ప్రాంతంలో మాత్రమే సాగు అయ్యే ప్రత్యేక రకానికి చెందినది. సాగుకు అధిక ఖర్చులు అవు తున్నాయి. అమ్మకం సమయంలో చాలా అవస్థలు పడాల్సిన అవసరం ఏర్ప డుతున్నది. ప్రభుత్వం శాశ్వత కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే సాగుకు ఆసక్తి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరలు పెరిగిన సమయంలో ఎగుమతికిపై నిషేధం విధిస్తుండడంతో ఆ ప్రభావం ఉల్లిపై పడుతున్నది.
- బి.పెద్ద పుల్లారెడ్డి, చల్లబసాయపల్లె, దువ్వూరు.
అమ్మకం కష్టంగా మారుతున్నది
కెపి ఉల్లి ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం విధిస్తుండటం, స్థానికంగా కొనుగోలు కేంద్రం లేకపోవడంతో అమ్మకం చాలా కష్టంగా మారుతున్నది. ఎన్నో ఏళ్ల నుండి ఉల్లి సాగు చేస్తున్నాం. గత ఏడాది అమ్మకం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా ఉల్లి కొనుగోలు చేయాలి. ఉల్లి కొనుగోలుకు శాశ్వత కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.
- కె మద్దిలేటి, చింతల ెరువు, చాగలమర్రి, నంద్యాల జిల్లా.










