Feb 06,2023 21:44

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలు

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలు

కదంతొక్కిన అంగన్‌వాడీలు
-నగరంలో భారీ స్థాయిలో నిరసన
-కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
నెల్లూరు:పే ద గర్భిణులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు పలు ఆరోగ్యసేవలందిస్తున్న అంగన్‌వాడీలు రాష్ట్ర ప్రభుత్వం తమకు కనీస వేతనంగా రూ.25 వేలు అందజేయాలని, ఉన్నత న్యాయస్థానం తీర్పును అనుసరించి గ్రాట్యూటి ఇవ్వాలని, మౌళిక వసతులు కల్పించాలని, ఫేస్‌ యాప్‌ రద్దు చేయాలని ఏపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్ప్‌ర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. సోమవారం నగరంలో ఆ సంఘం రాష్ట్ర కమిటి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని 13 ప్రాజెక్టులకు చెందిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్స్‌ అందరూ విఆర్‌సి క్రీడా మైదానం నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఈ నిరసనలో రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌళిక వసతులు కల్పించాలని, ఫేస్‌ యాప్‌ రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీలు బైటాయించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తమ సమస్యలు పరిష్కరిస్తారని ఎంతో ఆశతో పాలాభిషేకం, పూలాభిషేకం చేశామని, ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి అంగన్‌వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న వారిపై పర్యవేక్షణ పేరుతో అధికార పార్టీకి చెందిన నాయకులు వేదింపులకు పాల్పడటం దారుణమన్నారు. ఈ వేదింపులను నిలువరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గ్రేడ్‌ -2 సూపర్‌ వైజర్‌ పోస్టులకు వయోపరిమితి పెంచాలని, సీనియార్టిని అనుసరించి వేతనం అందజేయాలన్నారు. అంగన్‌వాడీలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని,వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తూ మృతి చెందిన వారి కుటుంబ సభ్యులల్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ర్యాలీలు, సభలు నిషేదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జివో నెంబరు-1ని రద్దు చేయాలన్నారు. స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు తాము అందజేసిన వినతిపత్రంలోని సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ నిరసన, ధర్నా కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.రెహనా బేగం , అధ్యక్షురాలు వై సుజాతమ్మ ,కోశాధికారి డి కొండమ్మ , శేషమ్మ ,రజిని ,సంపూర్ణ ,రాధా, ప్రమీల ,జయసుధ, అమర జ్యోతి,మస్తానమ్మ ,సుగుణమ్మ ,సుకన్య ,విజయలత ,సీతాదేవి ,లక్ష్మి ,మహాలక్ష్మి ,సుభాషిణి, అనురాధ ,సల్మా ,సరస్వతి, సిఐటియు నాయకులు టివివి ప్రసాద్‌ ,కె. పెంచల నర్సయ్య ,జి. నాగేశ్వరరావు, జివివి కుమార్‌ ,సురేష్‌ ,సంఘీభావంగా ఐద్వా జిల్లా కార్యదర్శి మస్తాన్‌ బి, శివకుమారి ,అరిగల రామమ్మ ,అనురాధ ,13 ప్రాజెక్టుల నుండి వర్కర్లు, హెల్పర్లు, మినీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.