Feb 06,2023 20:12

కలెక్టరేట్‌ను దిగ్బంధించిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు

సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్‌ ముట్టడి
పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట
ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌ : రాయచోటిలో అంగన్వాడీలు కదంతొక్కారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్ల యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ముట్టడి నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు పెద్దఎత్తున తరలివచ్చి కలెక్టరేట్‌ దాకా ర్యాలీగా వచ్చారు. అంగన్వాడీలు ముఖ ఆధారిత హాజరుపై ఆగ్రహించారు. డిమాండ్లతో కూడిన నినాదాలు చేశారు. ఉదయం 10 గంటలకే అంగన్వాడీల ధర్నా ప్రారంభమైంది. మధ్యాహ్నం అవుతున్నా అధికారులు స్పందించక పోవడంతో ఆగ్రహించిన అంగన్వాడీలు రాస్తారోకో నిర్వహించారు. రూరల్‌ సిఐ తన సిబ్బందితో ఆందోళనకారులతో చర్చించినా శాంతించలేదు. పోలీసులను నెట్టుకొని కలెక్టరేట్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించారు. కలెక్టర్‌ కార్యాలయం ప్రధాన ద్వారం పోలీసులు మూసివేశారు. గంట పాటు కలెక్టర్‌ కార్యాలయం దిగ్భంధనం చేశారు. కలెక్టరేట్‌లోకి వెళ్లనీయకుండా అంగన్వాడీలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు, కార్యాకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై అంగన్వాడీలు భగ్గుమన్నారు. తోపులాటలో ఇద్దరు అంగన్వాడీలు సృహ తప్పి పడిపోయారు. అనంతరం కలెక్టర్‌ గిరీషకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రాజేశ్వరి మాట్లాడుతూ కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని, ఫేస్‌ యాప్‌ రద్దు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పధకాలను అమలు చేయాలని, జిఒ-1ను తక్షణమే రద్దు చేయాలని, ప్రమోషన్లు కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అధికారులు, రాజకీయ నాయకుల వేధింపులు నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 2017 నుండి పెండింగ్‌లో ఉన్న టిఎ బిల్లులు వెంటనే ఇవ్వాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని, సీనియారిటీ ప్రకారం వేతనాలు ఇవ్వాలి, సూపర్‌ వైజర్‌ పోస్టులకు వయోపరిమితి తొలగించాలని కోరారు. హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలన్నారు. ప్రమోషన్లలో రాజకీయ జోక్యం అరికట్టాలన్నారు. 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరారు. మినీ సెంటర్లోని వర్కర్లను మెయిన్‌ వర్కర్లుగా తీసుకోవాలని, అదనంగా హెల్పర్‌ను నియమించాలని, ఆయిల్‌, కందిపప్పు క్వాంటిటీ పెంచాలని, అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని పేర్కొన్నారు. అంగన్వాడీలకు జాబ్‌ కేలండర్‌ నిర్ణయించాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలని, సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సెంటర్లను బలోపేతం చెయ్యడానికి నిధులు పెంచి అంగన్వాడీలకు ఉద్యోగభద్రత కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాల పర్యవేక్షణ చేయాలని, ఫుడ్‌ కమిషనర్‌, ఎం.ఎస్‌.కె, తహశీల్దార్‌, ఎంపిడిపి, రాజకీయ నాయకులు ఇలా అనేక మంది విజిట్ల పేరుతో అంగన్వాడీలను అవమానిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని, అంగన్వాడీలు మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్‌, రామాంజులు, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, అంగన్వాడీ యూనియన్‌ అధ్యక్షులు శ్రీలక్ష్మి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, వాటిని పరిష్కరించాలని న్యాయబద్దంగా అడిగితే అక్రమంగా అరెస్టులు చేయడం శోచనీయమన్నారు. ఈ ఆందోళనకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పందికాళ్ల మణి, కెవిపిఎస్‌ నాయకులు పెంచులయ్య, డిసి.వెంకటయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌.రామచంద్ర, నాగబసిరెడ్డి, వివిధ ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు బంగారమ్మ, ఖాజాబీ, ఓబులమ్మ, శిద్దమ్మ, మధురవాణి, గౌరి, శ్రీవాణి, కరుణశ్రీ, పద్మశ్రీ, భూకైలేశ్వరి, శ్రీరమాదేవి, విజయమ్మ, ఈశ్వరమ్మ పాల్గొన్నారు.