Dec 11,2022 22:18

సజ్జల రామకృష్ణారెడ్డితో వైసిపి నాయకులు బాహుద్దీన్‌, తదితరులు

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : కదిరి నియోజకవర్గంలోని వైసిపి నాయకుల్లో విబేధాలు బయటపడ్డాయి. ఎన్పీకుంట మండలంలో ఓప్రయివేటు కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి వైసిపి నాయకులు స్థానిక ప్రజాప్రతినిధిపై ఫిర్యాదు చేశారు. వైసిపి పట్టణ అధ్యక్షుడు బాహుద్దీన్‌ స్థానిక ప్రజా ప్రతినిధి సిద్ధారెడ్డిపై ఫిర్యాదు చేశారు. గతంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసిపి అభివృద్ధికోసం ఎంతో కృషి చేశామన్నారుజ కదిరిలో వైసిపి అధికారంలోకి రావటానికి అహర్నిశలు కృషి చేసిన నాయకులను స్థానిక ప్రజా ప్రతినిధి పూర్తిగా విస్మరించారని విమర్శించారు. పార్టీ అధికారంలోకి రావటానికి సైనికుల్లా పనిచేసిన ఎందరినో పక్కనపెట్టిన ఎమ్మెల్యే కేవలం తన వ్యక్తిగత స్వలాభం కోసం పనిచేస్తున్నారని తనకు అనుకూలమైన వారికి అండగా నిలుస్తూ పార్టీ పదవులతో పాటు నామినేటెడ్‌ పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధి ఒంటెత్తు పోకడలతో పార్టీకి తీవ్రనష్టం వాటిల్లిందని అన్నారు. అలాగే నియోజకవర్గంలో కాంట్రాక్ట్‌ పనులన్నీ సొంతవారికి కట్టబెడుతున్నారని పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కదిరి నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా కష్టాల్లో పడిందని నియోజకవర్గంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు భరోసానిచ్చేలా దృష్టి సారించాలని సజ్జలను వారు కోరారు.