Apr 10,2023 21:00

కబలిస్తున్న ప్లాస్టిక్‌ భూతం
రాయచోటి : అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్‌ నిషేధం అమలులో ఉన్నట్లా, లేనట్లా అనే పరిస్థితి ఏర్పడింది. జిలా ్లవ్యాప్తంగా రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, పీలేరు, మదనపల్లె , తంబళ్లపల్లె నియోజకవర్గాలు, మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎటు చూసినా ప్లాస్టిక్‌ కవర్లతో కూడిన చెత్త దిబ్బలు దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్‌ నిషేధం అమలులో ఉన్నా అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో ప్లాస్టిక్‌ వినియోగం అధికమైంది. ప్లాస్టిక్‌ నిషేధం పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలు జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. వినియోగం పర్యావరణానికి ముప్పు అని తెలిసినా వాడకం ఏమాత్రమూ తగ్గడం లేదు. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం ప్లాస్టిక్‌ 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న కవర్లు వినియోగించకూడదనే నిబంధనలున్నాయి. పట్టణంలోని బట్టల షాపులు, చికెన్‌ , మటన్‌ షాపులు , హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్స్‌, నిత్యావసర వస్తువులలో ప్లాస్టిక్‌ కవర్లను విచ్చలవిడిగా వాడుతున్నారు. ప్లాస్టిక్‌ వినియోగం రోజురోజుకూ పెరిగి పోవడం వల్ల బహిరంగ ప్రదేశాలలో వినియోగించిన ప్లాస్టిక్‌ కవర్లు పడేయటం, అవి ఏళ్లు గడిచినా కుళ్లిపోయి చెత్త చెత్త దెబ్బలుగానే దర్శనమిస్తున్నాయి. ఈ విషయంలో సంబంధిత అధికారులు చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. వినియోగదారులు, వ్యాపారులు ప్లాస్టిక్‌ కవర్లు వినియోగిస్తూనే ఉన్నారు. గతంలో ప్లాస్టిక్‌ కవర్ల వాడకంపై దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేసి , జరిమానాలు విధించేశారు. రాను రానూ సంబంధిత అధికారుల తనిఖీలు నామమాత్రంగా మారాయి. ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల ప్లాస్టిక్‌ కవర్లు అందుబాటులో ఉన్నాయి. ప్లాస్టిక్‌ నిషేధం అమలు కనుమరుగైపోతోంది. వర్షాకాలంలో అయితే పట్టణాలలో, గ్రామాలలో వర్షపు నీరు, మురుగునీరు కాలువలు, చెత్తకుండీలు, ఇతర బహిరంగ ప్రదేశాలు, రోడ్డుకు ఇరువైపులా దిబ్బలుగా దర్శనమిచ్చేవి. ప్లాస్టిక్‌ కవర్లు భూమిలో కాని, నీటిలో కాని కలిసి కుళ్లిపోవడానికి అవకాశం లేదు. దీనికి తోడు రసాయనాలతో కూడిన ప్లాస్టిక్‌ కలిసి ఉండడం వల్ల కేన్సర్‌ బారిన పడే ప్రమాదముందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వ్యవసాయ భూముల్లో ప్లాస్టిక్‌ వేస్తే పంటల దిగుబడి కూడా తగ్గిపోవడం, పంటలు చీడ పీడలకు గురికావడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్లాస్టిక్‌ వినియోగం వల్ల జరిగే అనర్థాల గురించి సంబంధిత అధికారులు స్పందించి ప్రజలకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. అవగాహన కల్పిస్తున్నాం జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్‌ నిషేధంపై గ్రామ స్థాయి నుంచి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధించామని, ఎల్‌టిసి శిక్షణ సమయంలో తాము ప్లాస్టిక్‌ కాలుష్యం వల్ల నష్టాలపై వివరిస్తున్నాం. మార్కెట్‌కు వెళ్లే సమయంలో ప్రజలందరూ క్లాత్‌(జనపనార) బ్యాగులను తీసుకెళ్లాలని చెపుతున్నాం. గ్రామాలలోని కిరాణా దుకాణాలు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను ఉపయోగించరాదని హెచ్చరిస్తున్నాం. ప్లాస్టిక్‌ కాలుష్యం గురించి పాఠశాల విద్యార్థులకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు విస్తత శ్రేణి అవగాహన అవగాహన కల్పిస్తున్నాం. నిబంధనలు పాటించని దుకాణాలపై జరిమానాలు విధిస్తున్నాం. అన్నమయ్య జిల్లాను ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు కషి చేస్తున్నాం. - మిద్దింటి ధనలక్ష్మి, డిపిఒ, రాయచోటి. - పట్టణంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ కవర్లు