ప్రజాశక్తి.పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తి నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు సమస్యలను ఏకరువు పెట్టారు. 2023-24 కు సంబంధించి రూ. 7.14 కోట్ల బడ్జెట్ ను కౌన్సిల్ ఆమోదించింది. బుధవారం మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబుళపతి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. వివిధ అభివద్ధి పనులకు కేటాయించిన బడ్జెట్‌కు కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. అనంతరం సమావేశంలో పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం అసహనం వ్యక్తం చేశారు. తాము ప్రతి సమావేశంలో సమస్యలను తెలిపిన అధికారులు పట్టించుకోలేదన్నారు. ప్రజలకు తాము ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. వైస్ చైర్మన్ తిప్పన్న మాట్లాడుతూ సాయి నగర్ లో డ్రైనేజీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ రత్నప్ప చౌదరి మాట్లాడుతూ పెద్ద కమ్మవారి పల్లికి రహదారి మరమ్మతులు చేయించమని, చెడిపోయిన మోటార్లు మరమ్మత్తు చేయించాలని పలుమార్లు కౌన్సిల్ దష్టికి తెచ్చిన ఫలితం లేదన్నారు. అధికారులు ప్రతిపక్ష వార్డులలో వివక్ష చూపుతున్నారని విమర్శించారు. కౌన్సిలర్ సాయిగీత మాట్లాడుతూ, వర్షాలకు రహదారులన్నీ గుంతలమయం అయినాయని తెలిపారు.10 వ వార్డు కౌన్సిలర్ అనిత మాట్లాడుతూ, వీధి దీపాలు వెలగడం లేదని, చెత్తను ఎత్తడం లేదని ఫలితంగా రోగాలు ప్రబలుతున్నాయని అన్నారు. సూర్య గౌడ్ మాట్లాడుతూ ఆదాయ వనరులు పెరగాలంటే దుకాణాలకు అనుమతి ఇవ్వాలన్నారు. సమస్యలను పరిష్కరిస్తామని కమిషనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఏ ఇ స్వాతి, సానిటరీ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.










