మండలి యోగం ఎవరికి దక్కేనో
బాక్సుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం
మొదటి రోజే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితం?
జిల్లాలో సర్వత్రా ఉత్కంఠ
ప్రజాశక్తి - కడప ప్రతినిధి : పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. అనంతపురం జిల్లా అధికార యంత్రాంగం గురువారం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ నెల 13న ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 212 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కడప జిల్లాలో 93 పట్టభధ్ర పోలింగ్ కేంద్రాలు, 38 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నడిచింది. కడప జిల్లాకు చెందిన ఐదుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవడంతో పోలింగ్‌కు అనూహ్య స్పందన లభించింది. కడప జిల్లాలో 72.01 శాతం పట్టభద్రులు, 91.31 శాతం ఉపాధ్యాయులు, అన్నమయ్య జిల్లాలో 68.31 శాతం పట్టభద్రులు, 93.36 శాతం ఉపాధ్యాయ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. పోలింగ్ అనంతరం ఎన్నికల బరిలో నిలిచిన 49 మంది పట్టభద్ర, 12 మంది ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. కడప జిల్లాకు చెందిన కత్తి నరసింహారెడ్డి, ఎ.రామచంద్రారెడ్డి, ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, అనిల్‌రెడ్డి, పట్టుపోగుల పవన్‌తో కలిసి ఐదుగురు బరిలో దిగిన నేపథ్యంలో ఫలితంపై జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ మొదలైన రోజు నుంచి మరుసటి రోజు ఉదయానికి ఎవరిని ఎమ్మెల్సీ యోగం పట్టనుందో తేలిపోయే అవకాశం ఉంది. మొదటి రోజు సాయంత్రానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, మరుసటి రోజు ఉదయానికి పట్టభధ్ర ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం తేలనున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ రోజు సాయం త్రానికి పట్టభద్ర ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ లెక్కింపు ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి రౌండ్‌లో పూర్తి మెజార్టీ లభించని అనంతరం రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మొదటిరోజు అర్థరాత్రి సమయానికి కట్టలు ఎవరికి ఏమేరకు వచ్చాయనే అంశంపై చూచాయగా స్పష్టత లభించనున్నట్లు తెలుస్తోంది.










