Feb 12,2022 07:10

   రైతుల ఆదాయం పెరగాలంటే ముందుగా రైతు వ్యవసాయ ఖర్చులు ప్రభుత్వం తగ్గించాల్సి ఉంటుంది. అలాగాక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు భారీగా కోతలు విధించింది. రైతాంగం పట్ల కక్షగట్టి వ్యవహరిస్తోంది. ఏడాదిపాటు జరిగిన రైతాంగ ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలనూ తుంగలో తొక్కింది. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా రైతులను అవమానపరిచింది. రైతు అమరవీరుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా మోసగించింది. వ్యవసాయం గిట్టుబాటుగాక రైతులే తమంతట తాము వ్యవసాయం వదిలేసే విధంగా బడ్జెట్లో కోతలు పెట్టింది. కార్పొరేట్‌ సంస్థలు లాభపడే విధంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. ప్రజలకు అమృత కాలమని చెపుతూ రాహు కాలానికి ద్వారాలు తెరిచింది.
    ఉత్పాదకతను పెంచి గిట్టుబాటు ధరలు ఇవ్యాలని, కనీస మద్దతు ధరల ప్రకారమైనా పంటలను కోనుగోలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. దేశంలో సుమారు 52 పంటలుకు మద్దతు ధర ప్రకటించాలని విజ్ఞప్తులు చేస్తుండగా కేవలం 14 పంటలకే ప్రకటించి. వరి, గోధుమ పంటలను మాత్రమే సేకరిస్తోంది. నిరుడు రూ. 2.48 లక్షల కోట్లు కేటాయించగా ఈ యేడు గతంలో కేటాయించిన దానికంటే రూ.11 వేల కోట్లు తగ్గించారు. దీని ప్రభావం పంటల కొనుగోలుపై పడుతుంది. అంటే భవిష్యత్తులో పంటలను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాదని స్పష్టమవుతోంది. డా|| స్వామినాథన్‌ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. కొనుగోలు చేసే పంటలను కూడా కౌలు రైతుల నుండి కొనుగోలు చేయటం లేదు. అలాంటప్పుడు కౌలు రైతులకు కనీసం పెట్టుబడి ఖర్చులూ వచ్చే పరిస్థితి లేదు.
   మార్కెట్‌ జోక్యం పథకం కింద 2021-22లో రూ.3,596 కోట్లు కేటాయించగా ఈయేడు కేవలం రూ.1500 కోట్లు కేటాయించి రైతులను ఆదుకుంటామని చెప్పటం వట్టి బూటకంగాక మరేమిటి? బిజెపి అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో ధరల స్థిరీకరణ నిధి కింద ఏడాదికి రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పింది. ఈ బడ్జెట్లో దాని ఊసే ఎత్తలేదు. రైతాంగం మీద ఎంత ప్రేమ ఉందో ఇది తెలియజేస్తోంది.
   నడుస్తున్న సంవత్సరంలో రూ.16.50 లక్షల కోట్లు పంట రుణాలుగా ఇచ్చామని, రానున్న ఏడాదికి రూ.18 లక్షల కోట్లను పంట రుణాలుగా ఇస్తామని, అందుకుగాను బడ్జెట్లో రూ.19 వేల కోట్లు వడ్డీ రాయితీ కింద కేటాయించామని చెబుతున్నారు. ఈ రుణాలు ఎవ్వరికి ఇచ్చారు? దేశం మొత్తంగా 50 శాతానికి పైగా కౌలు రైతులే పంటలు పండిస్తున్నారు. ఎన్‌.ఎస్‌.ఎస్‌ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ మొత్తం రైతుల్లో 42.4 శాతం, ఒడిషా 39 శాతం, పశ్చిమ బెంగాల్‌ 29 శాతం, త్రిపురలో 28.5 శాతం, బీహార్‌లో 28 శాతం, హర్యానాలో 21 శాతం, పంజాబ్‌ 21 శాతం, ఉత్తరప్రదేశ్‌ 18 శాతం, తెలంగాణలో 18 శాతం కౌలు రైతులు సాగు చేస్తున్నారు. ఇంతకంటే ఎక్కువ మంది కౌలు రైతులు ఉంటారు. వీరికి కౌలు గుర్తింపు కార్డులు లేవని పంట రుణాలు ఇవ్వడం లేదు. దీనివల్ల కౌలు రైతులు అధిక వడ్డీలకు ప్రైవేట్‌ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి పంటలు పండిస్తున్నారు. కనీసం సెంటు భూమి కూడా సాగు చేయని భూస్వాములు, భూ యజమానులే బ్యాంకుల నుండి 'వడ్డీ లేని అప్పులు' తెచ్చుకొని కౌలు రైతులకు నూటికి రెండు నుంచి ఐదు రూపాయలకు వడ్డీలకు ఇచ్చి కౌలు రైతుల ఆదాయాన్ని కాజేస్తున్నారు. అందుకు ఉదాహరణ మన రాష్ట్రమే. రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరంలో రూ.లక్ష కోట్లు పంట రుణాలు ఇస్తే కౌలు రైతులకు కేవలం రూ.350 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
పండిన పంటలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొనే అవకాశం లేక అయినకాడికి దళారులకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకు వచ్చిన చట్టం కౌలు రైతులకు శాపంగా మారింది.
    పెట్టుబడి సాయం కింద ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతు కుటుంబానికి రూ.6 వేల చొప్పున సాయం చేస్తోంది. ఈ పెట్టుబడి సాయానికి రాష్ట్ర ప్రభుత్వం ''రైతు భరోసా'' పేరుతో మరో రూ.7,500 కలిపి రైతులకు ఇస్తోంది. నిరుడు రూ.67 వేల కోట్లు కేటాయించారు. కౌలు రైతులను గుర్తించి వారికి కూడా అందించాలని కోరుతుంటే...మరో పక్క ఈ ఏడాది రూ.4 వేల కోట్లు తగ్గించి రూ.63 వేల కోట్లు కేటాయించారు. వాస్తవంగా ఇది భూమి పథకం కాదు పంటల పెట్టుబడి పథకం. భూమిలో సాగు చేస్తున్న కౌలు రైతులకు ఈ సహాయం అందడం లేదు. వ్యవసాయాన్ని వదిలి ఇతర వృత్తులు చేపట్టిన వారికి పెట్టుబడి సాయం కింద నగదును ఇవ్వడం ఎంతవరకు సమంజసమని కౌలు రైతులు అవేదన చెందుతున్నారు
   ఇదేగాక ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రతియేటా వేల కోట్ల రూపాయలు పంట నష్టం జరుగుతోంది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో తామరపురుగు ఆశించిన మిరప పంట మొత్తం ఊడ్చుకు పెట్టుకుపోయింది. రైతాంగం భారీగా నష్టపోయింది. ఇందులో కౌలురైతులే ఎక్కువ దెబ్బతిన్నారు. ఈ బడ్జెట్‌లో మిరప రైతుల పరిహారం గురించి కేటాయింపులే లేవు. మన రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీదకు... కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మీదకు నెట్టి మిరప రైతులకు పరిహారం ఇవ్వకండా నట్టేట ముంచారు.
    కొన్ని సందర్భాల్లో వచ్చిన ఇన్సూరెన్స్‌ పరిహారంకానీ ఇన్‌పుట్‌ సబ్సిడీకానీ కౌలు రైతులకు అందడం లేదు. ఈ రెండూ కూడా భూ యజమానుల బొక్కసం లోకి వెళుతున్నాయి. ఈ సంవత్సరం అన్ని పథకాలతోపాటు ఇన్సూరెన్స్‌ పథకానికి కోత తప్పలేదు. ప్రస్తుత సంవత్సరానికి రూ.16 వేల కోట్లు కేటాయించగా దానికి ప్రస్తుతం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కోత పెట్టారు.
   ఎరువుల ధరలు నిరుటి కంటే ఈయేడు 50 శాతం పెరిగాయి. పెరిగిన ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో సబ్సిడీ పెంచకపోగా తగ్గించడం చాలా దారుణం. నిరుడు ఎరువుల సబ్సిడీ రూ.1.40 లక్షల కోట్లు కేటాయించగా వచ్చే ఏడాదికి 1.05 లక్షల కోట్లకు కుదించారు. అంటే 25 శాతం తగ్గిపోయింది. ఇప్పటికే ఎరువుల ధరలు పెరిగి సతమతమవుతున్న రైతాంగానికి ఈ బడ్జెట్లో కోత వల్ల వాటి ధరలు మరింత పెరిగి సాగు భారంగా మారనుంది. గత ఏడాది 50 కిలోల డిఎపి ఒక కట్ట రూ.1,250 ఉంటే నవంబరులో రూ.1900కు పెరిగింది. ఇది కాస్త రూ.2500 వరకు పెరిగే అవకాశం ఉంది. ఎరువుల ధరలు పెరిగితే వ్యవసాయ రంగంలో తీవ్రమైన పరిణామాలు సంభవిస్తాయి.
    దీనితోపాటు అందరికి అవసరమైన ఆహార సబ్సిడీ పథకానికి నిధులను భారీగా తగ్గించారు. ఎంత తగ్గించారంటే రూ.65 వేల కోట్లు. 2021-2022 సంవత్సరం బడ్జెట్‌లో రూ.2,10,929 కోట్లు ఉంటే కొత్త బడ్జెట్‌ లో రూ.1,45,920 కోట్లే పెట్టారు. భారతదేశం ఆకలి సూచిలో 101వ దేశంగా వుందని మరువకూడదు. ఈ సమయంలో బడ్జెట్‌లో నిధులు పెంచాల్సిందిపోయి తగ్గించడం దారుణం. పోషకాహారం తగ్గి శిశు మరణాలు మరింత పెరుగుతాయి. ఆకలి పెరిగి మరణాలు సంభవిస్తాయి.
    గ్రామీణ ప్రాంతానికి ఎంతో ఉపయోగపడుతున్న పథకం గ్రామీణ ఉపాధి హమీ పథకం. సంవత్సరానికి రెండు వందల రోజులు పని దినాలు, రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుండగా వచ్చే సంవత్సరానికి రూ.98 వేల కోట్ల నుంచి రూ.73 వేల కోట్లుకు అమాంతంగా కుదించారు. ఈ తగ్గింపు గ్రామీణ ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
   రైతాంగ ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తామని 2016లో ప్రధాన మంత్రి మోడీ హామీ ఇచ్చారు. అది శుష్కప్రియంగా మారిపోయి శూన్య హస్తం చూపుతోంది. అయితే సాగు ఖర్చులు పెరిగాయి. విత్తనాల ధరలు 30 శాతం పెరిగాయి. ఎరువుల ధరలు 50 శాతం, పురుగు మందుల ధరలు 40 శాతం, వ్యవసాయ ఉపకరణాల ధరలు 100 శాతం, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. ట్రాక్టర్ల అద్దెలు మరో 50 శాతం పెరిగాయి. ఈ విధంగా పెట్టుబడికి కనీసం ఖర్చులు కూడా రావడం లేదు. చేసిన అప్పులు తీర్చలేక ప్రతి సంవత్సరం 12,600 రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీరిలో 90 శాతం మంది కౌలు రైతులే. వ్యవసాయ సంక్షోభం నుంచి కాపాడే విధంగా బడ్జెట్‌ నిధులు పెంచాలి. రైతాంగానికి భరోసా ఇవ్వాలి. కౌలు రైతులను గుర్తించి వారి సంక్షేమానికి, వారి అభివృద్ధికి నిధులు ఖర్చు చేయకపోతే రాబోయే కాలంలో వ్యవసాయమే ఉండదు. ఈ రోజు వ్యవసాయ నిలబడి ఉందంటే కౌలు రైతులు వల్లనే.
    కార్పొరేట్‌ సంస్థలకు ఉపయోగపడే హైటెక్‌ సాగు పద్ధతులు, అచరణలో సాధ్యం కాని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం, ఆధునిక పద్ధతిలో భారీ యంత్రాలు, డ్రోన్లతో సేద్యం వంటి వాటికి బడ్జెట్లో పుష్కలంగా నిధులు కేటాయించారు. అంటే దేశంలో వ్యవసాయం రంగంపై ఆధారపడే 65 శాతం రైతాంగానికి ఇది ఏ మాత్రం ఉపయోగపడదు. వీటిని నిర్వహించే కార్పొరేట్‌ సంస్థలకు లాభాలుంటాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర బడ్జెట్‌ నేల విడిచి సాము చేసినట్లుంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి భారీగా నిధులు పెంచటంతోపాటు...కౌలు రైతులను గుర్తించి వారికి వ్యవసాయ రాయితీ పథకాలన్నిటినీ వర్తింప చేసేలా చర్యలు చేపట్టాలి. లేకపోతే దేశం ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది.
 

(వ్యాసకర్త : ఎ.పి కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి)
పి.జమలయ్య

పి.జమలయ్య