అనంతపురం ప్రతినిధి : కౌలు రైతులకు గుర్తింపు లేదన్న ప్రజాశక్తి కథనం అవాస్తమంటూ అనంతపురం, సత్యసాయి జిల్లా వ్యవసాయాధికారుల రిజాండర్ ఇచ్చారు. కౌలు రైతులకు గుర్తింపునిస్తున్నామని, పంట రుణాలు, సబ్సిడీ విత్తనాలు అన్ని రకాలుగా అందుతున్నట్టు శుక్రవారం నాడు వివరణిచ్చారు. అయితే ఎంత మందికిచ్చారు.? ఎక్కడిచ్చారన్న వివరణ మాత్రం ఇవ్వకుండా అన్నీ చేసామంటూ బుకాయింపుతోనే సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
గతేడాది ఇచ్చినకార్డులనూ కలిపి ఎక్కువ చూపించే ప్రయత్నం
2022-23 సంవత్సరానిగానూ అనంతపురం జిల్లాలో 2657 సిసిఆర్‌సి కార్డులిచ్చినట్టు ఈనెల 7వ తేదీన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులకు ఇచ్చిన నివేదికల్లోనూ చూపించారు. అయితే వివరణలో మాత్రం 7500 సిసిఆర్‌సి కార్డులిచ్చామని ప్రకటించారు. వాస్తవానికి ఈ లెక్కలు ఈ ఏడాదికి సంబంధించినవి కావు. 2019వ సంవత్సరం నుంచి ఇచ్చిన సిసిఆర్‌సి కార్డులన్నింటినీ కలిపి ఈ ఏడాది 7500 కార్డులిచ్చినట్టు వివరణలో పేర్కొనడం గమనార్హం. కౌలు గుర్తింపు కార్డులు ఒక్క ఏడాది కాల పరిమితితోనే ఇస్తారు. మరో ఏడాది పొడిగించాల్సి ఉంటే రెన్యూవల్స్ చేయాల్సి ఉంటుంది. రెన్యూవల్స్ చేసిన గణాంకాలేవి అధికారుల వద్ద లేవు. పాతలెక్కలను అన్నీ కలిపి మొత్తం 7500 ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇందులో ఎంత మంది ఉన్నారో లేదో అన్న వెరిఫికేషన్ కూడా చేయలేదు.
ఒక్కరీ అందని పంటరుణం
గుర్తింపు పొందిన కౌలు రైతులకు 2022-23 సంవత్సరంలో అనంతపురం జిల్లాలో ఒక్కరీ పంటరుణమివ్వలేదు. అయితే అధికారులు మాత్రం పంటరుణాలిచ్చినట్టు వివరణలో పేర్కొన్నారు. నేరుగా పంటరుణాలివ్వడంలో సమస్య ఉందని జెఎల్‌జి (జాయింట్ లయబుల్ గ్రూపు) ద్వారా ఇస్తుంటారు. నలుగరు, ఐదుగురు కౌలు రైతులకు కలిపి ఒక గ్రూపుగా తయారు చేస్తారు. ఈ గ్రూపునకు రుణమిస్తారు. ఈ రకంగా చూసుకున్నా రైతులకు ఇచ్చింది పిసరంతే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక గ్రూపునకు రూ.1.15 లక్షలు మాత్రమే ఇచ్చారు. దీన్నే అధికారులు జిల్లాలోని కౌలు రైతులందరికీ రుణాలిచ్చినట్టు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.
అందని పరిహారం
కౌలు రైతులకు పంటనష్టపోతే ఒక్క రైతుకు పరిహారం అందిన దాఖలాల్లేవు. ఉదాహరణకు విడపనకల్లు మండలంలోని ఆర్‌కొట్టాల గ్రామం పరిధిలో అత్యధికంగా కౌలు రైతులున్నారు. ఈ గ్రామంలో 2021లో అధిక వర్షాలకు మిర్చి పంట పూర్తిగా దెబ్బతింది. కాని ఒక్క రైతుకు పరిహారం అందిన దాఖలాల్లేవు. అదే రకంగా వజ్రకరువూరు మండలంలోని పొట్టిపాడులోనూ మిర్చి రైతులు నష్టపోయారు. వారికి పరిహారం అందలేదు. ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో 42 మంది రైతులకు సిసిఆర్‌సి కార్డులూ ఇచ్చారు. వీరిలోనూ ఎవ్వరికి పరహారం అందలేదు. కనీసం సబ్సీడీ విత్తనాలు సైతం అందిన దాఖలాల్లేవు. కాని అధికారులు మాత్రం కౌలు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నట్టు వివరణివ్వడం గమనార్హం. 2021 సంవత్సరంలో మాత్రమే సబ్సిడీ విత్తనమిచ్చారు. 2022 ఖరీఫ్‌లోగాని, రబీలోగాని జిల్లాలో ఒక్క కౌలు రైతుకు సబ్సిడీ విత్తనమివ్వలేదు.










