అనంతపురం ప్రతినిధి : ప్రభుత్వం కౌలు రైతులకు అండగా ఉంటామని ప్రకటనలు చేస్తోంది. వారి కోసం సిసిఆర్‌సి కార్డు (కౌలు గుర్తింపు కార్డులు) ఇవ్వాలని నిర్ణయించింది. కౌలు కార్డులు ఇవ్వడం మొక్కుబడిగానే ఉంటోంది. అవి ఉన్నా కౌలు రైతుకు దక్కుతున్న ప్రయోజనం నామమాత్రంగానే ఉంటోంది. కనీసం పంటరుణాలు ఇచ్చిన దాఖలు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. దీంతో కౌలు రైతులు ప్రభుత్వ సాయానికి దూరం అవుతున్నారు. అటు పంటలు అందక ఇటు ప్రభుత్వ సాయం అందక కౌలు రైతులు రెండు విధాలా నష్టాన్ని చవిచూస్తున్నారు.
అనంతపురం, సత్యసాయి రెండు జిల్లాల పరిధిలోనూ కౌలు రైతులు ఉన్నారు. అనంతపురం జిల్లాలో 2657 సిసిఆర్‌సి కార్డులు ఇచ్చారు. సత్యసాయి జిల్లా పరిధిలో కేవలం 523 మాత్రమే ఇచ్చారు. ఒక్క అనంతపురం జిల్లా పరిధిలోనే సుమారు లక్ష మంది వరకు కౌలు రైతులు ఉంటారన్నది రైతు సంఘాల అంచనా. నల్లరేగడి నేలలున్నా ఉరవకొండ, కణేకల్, బొమ్మనహల్, విడపనకల్లు, వజ్రకరువూరు తదితర మండలాల్లో కౌలు రైతుల సంఖ్య గణనీయంగా ఉంది. ఈ ప్రాంతాల్లో కౌలు గుర్తింపు కార్డులు మంజూరు చూసినా నామమాత్రంగానే ఉంటోంది. ఇచ్చిన కౌలు గుర్తింపు కార్డుల్లోనూ అత్యధికంగా దేవాదాయ భూముల్లో సాగు చేసుకుంటున్న వారికే అధికంగా ఉంది. ప్రయివేటుగా రైతుల వద్ద కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసుకునే రైతులకు మొక్కుబడిగానే కౌలు గుర్తింపు కార్డులిచ్చారు.
ప్రభుత్వం ద్వారా అందే ప్రయోజనం శూన్యమే...
ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసింది కాని, దాని వలన కౌలు రైతుకు సబ్సిడీ విత్తనాలుగాని, పంటరుణంగాని అందుతున్న దాఖలాల్లేవు. పంటనష్టపోయిన సమయంలోనూ ఆ రైతులకు పరిహారం అందటం లేదు. అయితే ఈ గుర్తింపు కార్డు ఉండి రుణభారంతో చనిపోయిన రైతుకుటుంబాలకు మాత్రం పరిహారం అందుతోంది. కౌలు రైతు బతికుండగా అందిన సాయం శూన్యమనే చెప్పాలి. ఉరవకొండ మండలంలోని ముష్టూరులో గతేడాది జులై నెలలో రామాంజినేయులు అనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు గుర్తింపు కార్డు ఉండటంతో ఆ కుటుంబానికి పరిహారం అందింది. అయితే ఆ రైతు పంట సాగు చేసుకునే సమయంలో మాత్రం ప్రభుత్వం పరంగా అందిన సాయం శూన్యమనే చెప్పాలి. ఇలా కౌలు రైతులు గుర్తింపునకు నోచుకున్నా పంట సాగుకు అవసరమైన సాయం ప్రభుత్వం వైపు నుంచి అందటం లేదన్న ఆరోపణలున్నాయి.
ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందివ్వాలి
బాలరంగయ్య, ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి.
ప్రభుత్వం గుర్తింపు కార్డులు అందరికీ ఇవ్వటం లేదు. ఇచ్చిన వారికి కూడా అందుతున్న సాయం ఏమీ ఉండటం లేదు. పంటరుణాల్లేవు, సబ్సిడీ విత్తనాల్లేవు.. మొత్తం పెట్టుబడులు అంతా బయట అప్పుల చేసి తెచ్చి పెడుతున్నారు. పంటలు చేతికందకపోతే రుణభారం అధికమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం కౌలు రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలి. గుర్తింపు కార్డులను అర్హులైన వారందరికీ అందజేయాలి.










