Dec 30,2022 20:16

ఫొటో : మాట్లాడుతున్న సి ఐ టి యు రాష్ట్రఉపాధ్యక్షులు రమాదేవి

కావలిలో సిఐటియు ప్రచార యాత్ర
ప్రజాశక్తి-కావలి : 2, 3, 4 తేదీలలో భీమవరంలో జరుగుతున్న సిఐటియు రాష్ట్ర 16వ మహాసభల సందర్భంగా 28వ తేదీన కుప్పంలో ప్రారంభమైన ప్రచారయాత్ర శుక్రవారం ఉదయం కావలి పట్టణానికి చేరింది. అనంతరం ఉదయగిరి రోడ్డు కూడలిలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి 44 కార్మిక చట్టాలను మార్పు చేసిందని నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చిందన్నారు. కార్మికుల హక్కులు కోల్పోతున్నారని, కార్మిక ఉద్యోగ భద్రత తగ్గుతుందన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను విచ్చలవిడిగా అంబానీ, అదానీ లాంటి బడాపారిశ్రామికవేత్తలకు తక్కువ ధరలకు అప్పగిస్తుందని విమర్శించారు.
అంతేకాకుండా రైల్వే ఆస్తులను ప్రయివేటీకరిస్తుందని, రైల్వే ఛార్జీలతో పాటు అన్ని రకాలుగా ప్రజలపై భారం మోపుతుందన్నారు. ముఖ్యంగా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని, తక్కువ జీతాలతో ఎక్కువ శ్రమ చేపిస్తున్నారని విమర్శించారు. స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందన్నారు. ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులపై జరగబోయే రాష్ట్ర మహాసభలలో చర్చించి, రాబోవు రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిర్థిష్టమైన పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి అజరుకుమార్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం వంత పాడుతూ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ముఖ్యమంత్రి ప్రశ్నించకుండా రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక దామోదరం సంజీవయ్య పేరుతో ఉన్న విద్యుత్‌ జెన్కో ఆదానికి అప్పగించేందుకు చూస్తున్నాడన్నారు. జెన్కో ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అక్కడ ఉద్యోగులు, కార్మికులు 345 రోజులుగా పోరాటాలు కొనసాగిస్తుంటే, ప్రభుత్వం పట్టీపట్టనట్లుగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లో పయనిస్తూ రాష్ట్ర ప్రజలపై అనేక భారాలు మోపుతుందన్నారు. ఈ రెండు ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజాకార్మిక పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. జనవరిలో జరిగే రాష్ట్ర సిఐటియు మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు షేక్‌.రెహనాబేగం, పట్టణ సిఐటియు అధ్యక్షులు ఎ.వి.కృష్ణయ్య, కార్యదర్శి వై.కృష్ణమోహన్‌, నాయకులు కె.జాన్‌, బి.కృష్ణయ్య, సిపిఎం నాయకులు పి.పెంచలయ్య, ఎస్‌.వెంకయ్య, షేక్‌.మస్తాన్‌, డివైఎఫ్‌ఐ నాయకులు పి.పెంచలనరసింహ, పి.శ్రీనివాసులు, కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు.