Jan 27,2023 21:32

ఫొటో : గోగులపల్లిలో పర్యటిస్తున్న కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డి

'కాటంరెడ్డి'కి అడుగడుగునా జననీరాజనాలు
ప్రజాశక్తి-అల్లూరు : అల్లూరు నియోజకవర్గ మాజీ ఎంఎల్‌ఎ కాటంరెడ్డి విష్ణువర్ధన్‌ రెడ్డి శుక్రవారం 'శంఖారావం' పేరిట పడమర గోగులపల్లి, తూర్పు గోగులపల్లి దళితవాడల్లో 2వ రోజు ఎన్నికల ప్రచారం చేపట్టగా అడుగడుగునా ఆయనకు గ్రామస్తులు జననీరాజనాలు పలికారు. మహిళలు హారతులు, గుమ్మడి కాయలతో దిష్టి తీసి భాజాభజంత్రీల నడుమ పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలతో పలు దేవతలకు ప్రత్యేక పూజలు చేపట్టగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ అభివృద్ధికి ఎంతో సహకరించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని స్థానికులు తెలియజేశారు. ఈ సందర్భంగా కాటంరెడ్డి మాట్లాడుతూ పదవులు ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో అందరి ఆశీస్సులు ఉండాలని గ్రామస్తులను కోరారు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డితో మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా ఉప్పు రైతులకు ఎంతో మేలు చేశానని గుర్తు చేశారు. ఒక యూనిట్‌ ధర 4 రూపాయల 16 పైసలు ఉండగా వారి బాధలను అర్థం చేసుకొని 1 రూపాయి 6 పైసలకి యూనిట్‌ ధరను తీసుకువచ్చానని ప్రజలకు వివరించారు. కష్టం వచ్చినా.. నష్టమొచ్చినా.. ప్రజలతోనే ఉంటానని తెలియబరిచారు. ఎంతోమంది తనపై నమ్మకంతో గతంలో పోటీ చేసిన ఎన్నికలకు సహకరించి 84 వేల ఓట్లు వేశారని వారి రుణం ఎన్నటికీ తీర్చుకోలేనని తెలియజేశారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలిగినా తాను ఉన్నానని తెలిపారు. గోసల గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కావలిలో కొంతమంది నేతలు ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు నటించి ట్రైన్‌ ఎక్కగానే వెంటనే సెల్‌ ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేసి మొఖం చాటు వేస్తారంటూ ఎద్దేవా చేశారు. తమ నాయకుడు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి బాగోగులు చూస్తారంటూ హర్షం వ్యక్తం చేశారు. వైద్య పరంగా ఎంతోమందిని చెన్నరుకు పంపి వైద్యం చేసి పంపించిన సంఘటనలు కోకొల్లుగా ఉన్నాయని గుర్తు చేశారు. ఒకవేళ అత్యవసర సమయంలో మార్గం మధ్యలో ఉన్నప్పటికీ అనేకమార్లు ఫోన్‌ చేసి డాక్టర్లను అందుబాటులో ఉంచి వైద్యం చేయించి పంపేవారన్నారు. కొంతమంది నేతల ఇంటికి వెళితే నో ఎంట్రీ అని గేటు బయటే కలవనీయకుండా చేస్తారన్నారు. కానీ తమ నేత విష్ణువర్ధన్‌ రెడ్డి ఇంటి తలుపులు ఎప్పుడు తెరుచుకుని ఉంటాయని తెలియజేశారు. అలాంటి మహా నేతకు ప్రజలు ఆశీర్వదించాలంటూ వెల్లడించారు. కార్యక్రమంలో బాలకృష్ణంరాజు, శేఖర్‌రెడ్డి, ఆంజనేయులు, సాదేపల్లి దేవయ్య తదితరులున్నారు.