న్యూఢిల్లీ: కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు, వారి దాడులకు అన్ని తరగతుల ప్రజలు గురవుతుండడం ఒక ప్రధాన సమస్య. దీనిని పక్కదోవ పట్టించేందుకు ఇది హిందువులు, ముస్లింల మధ్య సమస్యగా చిత్రికరించే యత్నాలు చాలా కాలంగా జరుగుతున్నాయి. దానికి నిదర్శనమే తాజా వివాదాస్పద 'కాశ్మీర్ ఫైల్స్' చిత్రం. గత శుక్రవారం విడుదలైన 'కాశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని ఉపయోగించుకుని దేశంలో ఇస్లామిక్ ఫోబియాను రెచ్చగొట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. ఈ చిత్రంలో పాత్రలు, కథ అంతా కల్పితమని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, చూశారా, కాశ్మీరీ పండిట్లను ముస్లింలు ఎంత క్రూరంగా హింసించి, అక్కడి నుంచి వెళ్లగొట్టారో అంటూ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని బిజెపి పెద్దయెత్తున దుష్ప్రచారం ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నుంచి బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరకు ఈ చిత్రానికి ప్రమోటర్లుగా మారిపోయారు. బిజెపి పాలిత రాష్ట్రాలు ఈ చిత్రానికి వినోద పన్ను పూర్తి మినహాయింపు ప్రకటించాయి. ఈ విషయంలో ఎక్కడ వెనకబడి పోతామోనని భావించిన కాంగ్రెస్ పాలిత చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి కూడా ఈ చిత్రానికి పన్ను రాయితీ ప్రకటించారు. నొయిడాలో ఓ సినిమా థియేటర్‌లో ఎసి పనిచేయక కాసేపు షో నిలిచిపోతే, దానిపై హిందూత్వ మూకలు నానా యాగీ చేశాయి. థియేటర్ యజమాని మైనార్టీ మతానికి చెందినవాడు కావడం వల్లే చిత్రాన్ని ఆపేశారని నిందించాయి. 'కాశ్మీరీ పండిట్లు అయిన తన తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోలేదని, ఇస్లామిక్ ఉగ్రవాదుల చేతిలో చనిపోయారని తన తాత ద్వారా తెలుసుకున్న ఓ యూనివర్సిటీ విద్యార్థికి సంబంధించిన అంశాన్ని ఇతివృత్తంగా చేసుకుని తీసిన ఈ చిత్రంలో కాశ్మీర్ చరిత్రకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరించే యత్నం చేశారని పలువురు విమర్శకులు వ్యాఖ్యానించారు.
కాశ్మీర్ ఫైల్స్ తీసినవారు లఖింపూర్ ఖేరి ఫైల్స్ ఎందుకు తీయరని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌లో ఎప్పుడో జరిగిన వాటి గురించి మాట్లాడుతున్నవారు, అయిదు మాసాల క్రితం లఖింపూర్ ఖేరిలో నిరసనతెలుపుతున్న రైతులను కారుతో తొక్కించి చంపిన కేంద్ర మంత్రి తనయుడి ఘాతుకం గురించి ఎందుకు మాట్లాడరు అని ఆయన ప్రశ్నించారు.
పాత గాయాలను మాన్పి ఇరువర్గాల మధ్య మత సామరసాన్ని పెంపొందించేందుకు బదులు మత విద్వేషాలను రెచ్చగొట్టడానికే 'కాశ్మీర్ ఫైల్స్ ' ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వాడుకుంటున్నదని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విమర్శించారు. కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని కేంద్రం ప్రమోట్ చేయడం వెనక కాశ్మీరీ పండిట్ల వ్యథను ఒక అస్త్రంగా చేసుకోవాలన్న దుర్బుద్దే ఎక్కువగా కనిపిస్తోందని ఆమె అన్నారు.
ఉగ్రవాద దాడుల్లో కాశ్మీరీ పండిట్ల గురించి మాత్రమే మాట్లాడుతున్న వారు, కాశ్మీర్‌లో ఉగ్రవాదం అణచివేత పేరుతో అమాయక కాశ్మీరీయులపై సాగిస్తున్న అకృత్యాల గురించి ఎందుకు మాట్లాడరు? కాశ్మీరీ పండిట్లపై జరిగిన దాడులను ఎవరూ సమర్థించరు. ఇతర దేశాలకు తరలిపోయిన కాశ్మీరీ పండిట్ల ను తిరిగి రప్పించేందుకు వాజ్‌పేయి హయాంలో ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని కాశ్మీర ప్రభుత్వం ప్రయత్నించింది. కాశ్మీరీ పండిట్లు తిరిగి వచ్చి స్థిరపడాలనుకుంటే వారికి అన్ని విధాలా సహకారం అందిస్తామని మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికీ కాశ్మీర్ లోయలో పండిట్ల స్థిరాస్తులు చాలావరకు పదిలంగానే ఉన్నాయి. ఎక్కడైనా కబ్జా జరిగి ఉంటే వాటిని తిరిగి పండిట్లకు అప్పగిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయినా, విదేశాల్లో స్థిరపడిన పండిట్లు తిరిగి రావడానికి సుముఖత చూపడం లేదు. ఇదీ వాస్తవ పరిస్థితి. కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో ఈ వాస్తవాలన్నిటినీ మరుగుపరచి కేవలం కాశ్మీరీ పండిట్ల శరణార్థుల దుస్థితి గురించే ఎక్కువగా చూపారు. చిత్రించడానికే చిత్ర దర్శకలు వివేక్ అగ్నిహౌత్రి యత్నించారు. కథా కథనం నడిపిన తీరు, పండిట్లపై హత్యాకాండకు సంబంధించి చూపిన దృశ్యాలు ప్రజలను తప్పుదోవ పట్టించేవిధంగాను, ఇస్లామిక్ ఫోబియాను రెచ్చగొట్టే విధంగాను ఉన్నట్లు విమర్శకులు పేర్కొంటున్నారు. -
కాశ్మీర్ పండిట్ల కన్నా ఇతరులే ఎక్కువమంది చనిపోయారు : ఆర్‌టిఐకి ఇచ్చిన సమాధానంలో ప్రభుత్వం వెల్లడి
1990లో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన కాశ్మీరీ పండిట్లు 89 మంది కాగా, ఇతర మతాలకు చెందినవారు 1635 మంది వరకు ఉన్నట్లు ప్రభుత్వమే స్వయంగా తెలిపింది. గత ఏడాది నవంబరు17న సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ యాక్టు) కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా కాశ్మీర్ ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది. వాస్తవమిది కాగా, హిందువులైన కాశ్మీరీ పండిట్లను ఊచకోత కోశారంటూ బిజెపి, ఆరెస్సెస్ అదే పనిగా ప్రచారం చేస్తున్నాయి.
(ఫీచర్స్ అండ్ పాలిటిక్స్)










