ప్రజాశక్తి - కడప ప్రతినిధి/కడప అర్బన్
సమర్థ కార్యకర్తలను గుర్తించే బాధ్యత నాదని, క్షేత్రస్థాయిలో ఓట్లు తెచ్చే బాధ్యత మీరు తీసుకోవాలని కార్యకర్తలనుద్దేశించి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం కడప నగరంలోని పుత్తా ఎస్టేట్లో జోన్-5 సమీక్షా సమావేశానికి హాజరై మాట్లాడుతూ జోన్‌ల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని సంస్థాగతమైన అసెంబ్లీ, క్లస్టర్, యూనిట్, మండల వారీగా బలోపేతం చేయ డంపై దృష్టి సారించామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలోని 100 మందికి ఇద్దరు సాధికార సారధులను నియమిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన నిరసన పిలుపు, ఇంటింటికీ క్యాంపెయిన్, బాదుడేబాదుడు, ఇదేమి ఖర్మ వంటి నిరసన కార్యక్రమాల్లో పనితీరును రివ్యూ చేశామని తెలిపారు. జోన్-5లోని 35 అసెంబ్లీల పరిధిలోని ప్రొద్దుటూరు, కల్యాణదుర్గం, రాప్తాడు నియోజకవర్గాల్లో మెరుగైన పనితీరు కనిపిస్తున్న నేపథ్యంలో ఇన్‌ఛార్జులు అనుభవాలను తెలియజేయాలన్నారు. కడప స్టీల్ ప్లాంట్‌కు మూడు శంకుస్థాపనలు చేయడమేమిటని ప్రశ్నించారు. సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ చిరునామా నిలిచిందని చెప్పారు. టిడిపి హయాం నాటి రంజాన్‌తోఫా, పండుగ కాను కలు, విదేశీవిద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి సంక్షేమాన్ని నిర్వీర్యం చేశారన్నారు. అప్పటి ప్రతిపక్ష నాయకుని హోదాలో ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలైన చెన్నూరు చక్కెర, ప్రొద్దుటూరు పాల కేంద్రం పునరుద్ధరణ సంగ తేమిటని నిలదీశారు. అనంతరం ఇటీవల కడప పార్లమెంట్ ఐటిడిపి ప్రధాన కార్యదర్శి నరసింహులు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఆయన భార్యకు రూ.9 లక్షల చెక్కును అంద జేశారు. పెద్దదర్గాలో ప్రార్థనల అనంతరం ఇప్తార్ విందుకు హాజరై ప్రసంగించారు. సమీక్షా సమావేశంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, కడప, నంద్యాల, కర్నూలు, హిం దూపురం, అనంతపురం జిల్లాలకు చెందిన అధ్యక్షులు, 35 నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, ఎమ్మెల్సీలు రామ గోపాల్‌రెడ్డి, బిటి నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్, శ్రీనివాసరెడ్డి, కాలువ శ్రీనివాసులు, మాజీ మంత్రి అమర్ నాధ్‌రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్ల పార్ధసారధిరెడ్డి, కడప నియోజకవర్గ ఇన్‌ఛార్జి అమీర్‌బాబు, పుత్తా నరసింహారెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, ప్రవీన్‌కు మార్‌రెడ్డి, భూపేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరద రాజులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు బచ్చల పుల్లయ్య, శివనాధరెడ్డి, రాష్ట్ర మహిళా అధ్యక్షులు ఝాన్సీ, జిల్లా నాయకులు గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్, జంబాపురం రమణారెడ్డి, ముక్తియార్‌తోపాటు పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎప్పుడు ఎన్నికలొచ్చినా గెలుపు టిడిపిదే :అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలుపు టిడిపిదేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు అన్నారు. మంగళవారం పుత్తా ఎస్టేట్లో జోన్ 5 సమావేశం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వై.ఎస్. జగన్‌లాంటి దుర్మార్గపు సిఎంను చూడలేదని పేర్కొన్నారు. వైసిపిలాగా తెలుగుదేశం పార్టీ గాలికి పెట్టిన పార్టీ కాదని తెలిపారు. విశ్వవిఖ్యాత నట సార్వ భౌమ ఎన్ టి రామారావు స్థాపించిన పార్టీ అని అన్నారు. ముఖ్యమంత్రి ఇడుపులపాయలో నోట్ల కట్టలు పాతిపెట్టారని, ఆ కట్టలు ఎన్నిక లప్పుడు బయటకు తీసి గెలవాల నుకుంటున్నారని విమర్శించారు. గతంలో కోడి కత్తి ద్వారా సానుభూతి పొందాలనుకుంటే కుదరక, సొంత బాబాయిని చంపి జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చారని ఆరోపించారు. వివేకా హత్యకేసులో అనుమానితుడుగా ఉన్న ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డి, నిందితులుగా ఉన్న వారి ఆడవాళ్లతో వివేకాకు సంబంధాలు అంటగట్టడం విచారకరమన్నారు. టిడిపి పోలిటి బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి ప్రసంగిస్తూ 40 సంవత్సరాల వైఎస్ కుటుంబ పాలనలో జిల్లాకు ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు.










