ప్రజాశక్తి మడకశిర రూరల్ : అగళి మండల వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న శ్రీరామ్ నాయక్ తన కార్యాలయాన్నే నివాసంగా మార్చేశాడు. దీంతో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగికి ఇబ్బందిగా మారింది. మహిళా ఉద్యోగులు ముఖ హాజరు వేయాలంటే కార్యాలయం బయటే వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ అధికారి ఉదయం కార్యాలయం పనివేళల్లో ముఖ హాజరు వేసిన తర్వాత స్నానం చేసి ఆ తర్వాత విధులకు హాజరవుతుంటాడు. దీంతో అటు మహిళా ఉద్యోగులకు, ఇటు ప్రజలకు అసౌకర్యం ఏర్పడిందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు గతంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం కలగలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక వ్యవసాయ అధికారి శ్రీరామ్ నాయక్‌ను వివరణ కోరగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. ఇలా కార్యాలయంలోనే నివాసం ఉండవచ్చునని అన్నారు. అయినా ఇది తన స్వంత విషయమని తనకు ఇష్టం వచ్చినట్టు ఉంటానని అడగడానికి సంబంధం లేదని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. తాను 24 గంటలు కార్యాలయానికి భద్రతగా ఉంటానని అందువల్ల తనను ప్రశ్నించే అధికారం లేదని అన్నారు.










