Jul 18,2022 23:03

  • ట్యాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌

ప్రజాశక్తి-విజయవాడ
గత నెలలో విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు జరిపిన యాత్ర నగరానికి ఎలా ఉపయోగపడుతుందో నిర్ధిష్టంగా ప్రజలకు వెల్లడించాలని ట్యాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎంవి ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత నెల 10వ తేదీ నుంచి 21 వరకు అధికార పక్షానికి చెందిన 35 మంది, ప్రధాన ప్రతిపక్షం టిడిపికి చెందిన ఐదుగురు మొత్తం 40 మంది కార్పొరేటర్లు, ఐదుగురు అధికారులు ఢిల్లీ, ఆగ్రా, అమృత్‌సర్‌, జమ్ము, శ్రీనగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్లను సందర్శించా రన్నారు. ఈ యాత్ర కోసం నగరపాలక సంస్థకు సంబంధించిన రూ.33 లక్షలు కేటాయించారన్నారు. ఇదంతా నగర ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బు అన్నారు. గత కార్పొరేటర్ల యాత్ర వల్ల లక్షలాది రూపాయలు ప్రజాధనం ఖర్చు అయిందే తప్ప, విజయవాడ నగరానికి ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదన్నారు. ప్రస్తుత వైసిపి పాలనలోనే ఆస్తిపన్నులు భారీ స్థాయిలో పెంచారన్నారు. ప్రతి ఏటా ఆటోమెటిక్‌గా పెరిగే విధంగా చట్టాలు చేశారన్నారు. ఇది చాలదన్నట్లుగా చట్ట విరుద్దమైన చెత్త పన్ను విధించారన్నారు. విజయవాడ ప్రజల నుంచి నీటి చార్జీలు భారీగా వసూలు చేస్తున్నారన్నారు. ఇలా వివిధ రూపాల్లో ప్రజల నుంచి ఏటా వందల కోట్లు కార్పొరేషన్‌ వసూలు చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో సాగిన ప్రస్తుత కార్పొరేటర్ల యాత్ర నగరానికి ఏ విధమైన ప్రయోజనాన్ని చేకూర్చబోతున్నది అన్న విషయాన్ని పన్ను చెల్లింపుదారులకు తెలియాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ అధ్యక్షులు వి.సాంబిరెడ్డి, విఎస్‌ రామరాజు, వేదాంతం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.