Mar 30,2023 22:07

జీపుజాతాలో పాల్గొన్న నాయకులు

పెనుకొండ : కేంద్రంలోని మోడీ ఆధ్వర్యంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ల కొమ్ముకాస్తోందని రైతుసంఘం, సిఐటియు నాయకులు విమర్శించారు. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సిఐటియు, రైతు సంఘం , వ్యవసాయ కార్మిక సంఘం ,కౌలు రైతు సంఘం ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీపు జాతా గురువారం పెనుకొండ చేరుకుంది. ఈ సందర్బంగా పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, ఉపాధ్యక్షులు హరి, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, కౌలు రైతుల సమస్యలు పట్టించుకోలేదన్నారు. మతం పేరుతో ప్రజలను విడగొట్టి పరిపాలిస్తున్నారన్నారు. మోడీ పాలనకు వ్యతిరేకంగా ప్రజా అనుకూల విధానాల సాధన కోసం ఏప్రిల్‌ 5న ఢిల్లీలో జరిగే కార్మిక కర్షక పోరాట ప్రదర్శనలో అత్యధిక మంది పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఫక్రుద్దీన్‌, సిఐటియు నాయకులు వజ్రం నాగప్ప, చిన్న వెంకటేష్‌, తిప్పన్న, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు బావమ్మ తదితరులు పాల్గొన్నారు.
రొద్దం : చలో ఢిల్లీ కార్యక్రమం నేపథ్యంలో సిఐటియు, రైతుసంఘం ఆధ్వర్యలో నిర్వహిస్తున్న జీపుజాతా గురువారం రొద్దంలో కొనసాగింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక ,కర్షక, వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కారం కోసం ఏప్రిల్‌ 5న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, రైతుసంఘ, సిపిఎం నాయకులు పాల్గొన్నారు.
పరిగి : ఏప్రిల్‌ 5న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ చేపట్టిన జీపుజాతా గురువారం మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆప్రజాస్వామ్య విధివిధానాలపై వచ్చే నెల 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్‌, రైతు సంఘం నాయకులు పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం :కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను ఐక్యంగా ఎండగదామని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌ పిలుపు నిచ్చారు. కార్మిక, కర్షక సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 5న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ జిల్లాలో చేపట్టిన జీపుజాత గురువారం హిందూపురం పట్టణానికి చేరింది. ఈ సందర్బంగా పట్టణంలో ప్రదర్శన నిర్వహించి, అంబేద్కర్‌ సర్కిలలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాలను సవరించిందని విమర్శించారు. ప్రవేశపెట్టిన బడ్జెట్‌ దేశ సంపదను దోచిపెట్టే విధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి గంగాధర్‌, సిఐటియు పట్టణ కమిటీ కోశాధికారి రామకృష్ణ, ఉపాధ్యక్షులు అత్తరు బాబా, నాయకులు చంద్ర, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు మల్లికార్జున, కల్లూరు ఆటో స్టాండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు రఫీక్‌, పరిగి మండల సిఐటియు కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
సోమందేపల్లి : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్నుత్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు , వ్యవసాయ కార్మిక , సిఐటియు , కౌలు రైతు ఉమ్మడి సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 5న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నాయకులు కోరారు. చలో ఢిల్లీ కార్యక్రమం నేపథ్యంలో జిల్లాలో రెండు రోజుల క్రితం ప్రారంభమైన జీపు జాత గురువారం సోమందేపల్లి మండల కేంద్రానికి చేరుకుంది. స్థానిక ఎన్టీఆర్‌ సర్కిల్‌ మీదుగా వాల్మీకి సర్కిల్‌ నందుకు చేరుకుంది. అక్కడ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రమేష్‌ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజాభివృద్ధే ధ్యేయం అంటూ హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం చేతలతో బడా కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. రైతుల పంటలకు కనీస గిట్టుబాటు మద్దతు ధర, చట్టబద్ధం చేయకుండా కాలయాపన చేస్తూ రైతులను వ్యవసాయానికి దూరం చేసే విధంగా చూస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, జిల్లా కమిటీ సభ్యులు ఫక్రుద్దీన్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్‌, వెంకటరాముడు, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్‌ , హనుమంత రెడ్డి , కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు హనుమయ్య జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బాలస్వామి, అంగన్వాడి యూనియన్‌ ప్రాజెక్ట్‌ కార్యదర్శి శ్రీదేవి , చేనేత కార్మిక సంఘం మండల కార్యదర్శి రాజగోపాల్‌ , భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రంగప్ప , ఆవాజ్‌ మండల అధ్యక్ష , కార్యదర్శులు మాబు, చాంద్‌ బాషా, చేనేత కార్మిక సంఘం మండల నాయకులు శీలా నారాయణస్వామి, బెస్త క్రిష్టప్ప , ఉప్పర కిష్టప్ప , భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ నాయకులు నాగభూషణ , సిఐటియు మండల నాయకులు కొండా వెంకటేశులు, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల నాయకులు రవి , మల్లికార్జున యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.