డబ్బు లోటు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం... రెడీమేడ్‌గా ఉన్న ఆస్తుల లీజు ద్వారా... రూ.6 లక్షల కోట్లు ఆర్జించే జాతీయ నగదీకరణ పథకాన్ని ప్రకటించింది. ప్రధాన మంత్రి ప్రకటించిన 5 సంవత్సరాల మౌలిక సౌకర్యాల అభివృద్ధి ప్రణాళికకు అవసరమైన రూ. 111 లక్షల కోట్లలో లీజు ద్వారా వచ్చే రూ. 6 లక్షల కోట్లు (5.4 శాతం) ఒక భాగం. ఇది అతిస్వల్పం. రూ. 111 లక్షల కోట్లలో కేంద్ర వాటా 39 శాతం. ఈ పథకంలోకి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా లాగుతారు. 12 కేంద్ర మంత్రిత్వ శాఖల కింద విస్తరించిన 20 రకాల ఆస్తులను ఈ ప్రణాళికలో భాగం చేశారు.
ఆస్తుల లీజు లక్ష్యాలు
ఆస్తుల నగదీకరణను ప్రతిపక్ష పార్టీలు చట్టపర దోపిడీగా, ప్రమాదకర చర్యగా పేర్కొన్నాయి. అమూల్యమైన ఆస్తులను దశాబ్దాల తరబడి కారుచౌకగా ప్రైవేట్ చేతుల్లో పెట్టటాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఈ విమర్శలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిరస్కరించారు. ప్రభుత్వ యాజమాన్యాన్ని బదిలీ చేయటం లేదని, లీజు ద్వారా వచ్చే డబ్బులను మౌలిక సౌకర్యాల నిర్మాణంలో పెట్టుబడులుగా పెడతామంటున్నారు. పూర్తిగా నిర్మించి నిరుపయోగంగా పడిఉన్న లేదా తక్కువ ఉపయోగంలో ఉన్న ఆస్తులను లీజుకు ఇస్తామని ఆర్థికమంత్రి చెప్పారు. ఇలా చెప్పటం ద్వారా తమ ప్రభుత్వ అసమర్ధతను బయట పెట్టారు. నిరుపయోగంగా ఉన్న ఆస్తులను పెట్టుబడిదారులు ఎందుకు తీసుకుంటారనే మరో ప్రశ్న ఉదయిస్తుంది.
ఈ భారీ అమ్మకాలకు పాల్పడటం మోడీ ప్రభుత్వ ఘోర వైఫల్యాన్ని సూచిస్తుంది. ధనవంతుల మీద, కార్పొరేట్ కంపెనీల మీద పన్ను వేయటంలో, పన్నుల ఎగవేతను అరికట్టడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. పైగా మౌలిక సౌకర్యాల ఆస్తులను లీజుకి తీసుకునే పెట్టుబడిదారులు ప్రజలకు సేవ చేయటానికి తీసుకోవటం లేదనే అంశాన్ని ప్రభుత్వం దాచిపెడుతోంది. బడా కార్పొరేట్ సంస్థలకు అతి చౌక రేట్ల మీద ఈ ఆస్తులను అప్పజెప్పటానికి వాటి విలువను కావాలనే తక్కువ చేసి చూపిస్తున్నది.
ఆస్తుల నగదీకరణ కార్యక్రమం వలన ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీతారామన్ చెప్పారు. అధిక ఆర్థికాభివృద్ధి జరుగుతుందన్నారు. ఉద్యోగాలు సృష్టించటం, ఆర్థికాభివృద్ధి జరగటం ఎలా సాధ్యమనేది ప్రశ్న. తమ లీజు కాలంలో పని గంటలు పెంచి, కార్మికులను లేదా వేతనాలను తగ్గించి పెట్టుబడిదారులు అత్యధిక లాభాలను గడిస్తారు. సహజంగా పెట్టుబడిదారులు తమ సేవల చార్జీలు పెంచుతారు. పోటీని అదపు చేస్తారు. సేవల నిర్వహణా వ్యయాన్ని తగ్గిస్తారు. పర్మినెంట్ ఉద్యోగాలు ఉండవు. లీజు తుది దశలో నిర్వహణను పట్టించుకోరు. ఆస్తులు పాడయిపోయిన స్థితిలో ప్రభుత్వానికి స్వాధీనం చేస్తారు. అపుడు ప్రభుత్వం లీజు కాలాన్ని పెంచాలి. లేదా వారికి అమ్మాలి.
ఇతర దేశాల అనుభవాలు
ధనిక దేశాలలో ప్రజారంజక ప్రభుత్వాలు తిరిగి ఏర్పడుతుండగా, భారతదేశం తిరోగమనంలోకి పోతోంది. ప్రజారంజక ప్రభుత్వాల కాలం తీరటాన్ని ప్రజలు చూస్తున్నారు. బ్రిటన్‌లో రైల్వే రంగాన్ని తిరిగి జాతీయం చేస్తామని ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ముక్కలు కావటానికి, గందరగోళానికి, అధిక సంక్లిష్టతకు దారితీసిన 1993 నాటి బ్రిటీష్ రైల్వే ప్రైవేటీకరణను ఆయన విమర్శించారు.
అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ వినిమయ ప్యాకేజీని అక్కడి డెమోక్రాటిక్ ప్రభుత్వం అమలు చేస్తోంది. 4.7 లక్షల కోట్ల డాలర్ల (రూ. 352 లక్షల కోట్ల )లో 1.2 కోట్ల డాలర్లు (రూ. 90 లక్షల కోట్లు) రోడ్లు, వంతెనలు, నీటి మౌలిక సౌకర్యాలు, విద్యుత్తు రంగం తదితర మౌలిక రంగాల నిర్మాణానికి ఉపయోగిస్తోంది. ఇది అక్కడి పార్లమెంట్ ఆమోదం పొందింది. 2021 ఆగస్టు 10న మరో 3.5 లక్షల కోట్ల డాలర్లు (రూ. 265 లక్షల కోట్లు) ఆరోగ్య సౌకర్యాల విస్తరణకు, వాతావరణ ఉపద్రవాలను ఎదుర్కొనేందుకు కూడా సెనేట్ ఆమోదం పొందింది.
ఇతర దేశాలలో నగదీకరణ అనుభవాలను ఆండీ ముఖర్జీ బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో వివరించారు. సింగపూర్‌లో సబర్బన్ రైళ్ళను, సిగలింగ్ వ్యవస్థను తిరిగి జాతీయం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అక్కడి ప్రైవేట్ పెట్టుబడిదారులు వాటి నిర్వహణా వ్యయాన్ని బాగా తగ్గించారు. దాంతో రైళ్ళు సజావుగా నడవటం ఆగిపోయింది. ప్రయాణీకులు కోపోద్రిక్తులయ్యారు.
ఆస్ట్రేలియా లోని న్యూ సౌత్‌వేల్స్ రాష్ట్రంలో విద్యుత్తు స్తంభాలను, వైర్లను ప్రైవేటీకరించారు. ఐదు సంవత్సరాల్లో విద్యుత్తు చార్జీలు రెట్టింపయ్యాయి. ప్రభుత్వం ముందుకు వచ్చి వినిమయదారులపై భారాన్ని తగ్గించేందుకు ప్యాకేజీని ప్రకటించింది. మన దేశ ప్రజలు ఇప్పటికే విద్యుత్తు భారాలతో సతమతమవుతున్నారు. ఇంకా కార్పొరేట్ కంపెనీల పట్ల మోడీ ప్రభుత్వ ఔదార్యాన్ని భరించే స్థితిలో లేరు.
2013లో ఆస్ట్రేలియాలో సిడ్నీ నగరానికి దగ్గరలోని రెండు ఓడరేవులను లీజుకు ఇచ్చారు. కానీ, ఇటీవల వినిమయదారుల కమిషన్ చైర్మన్, ప్రైవేటీకరణ - సామర్ధ్యం పెరగటానికి దారితీయకపోతే మళ్ళీ తిరిగి లీజుకి ఇవ్వటం, ప్రైవేటీకరణ చేయటం మానుకోవాలన్నారు. కానీ మన దేశంలో సామర్ధ్యం అనేది ప్రశ్నకాదు. ఉన్నదల్లా జాతీయ ఆస్తులను కొల్లగొట్టటమే.
ఇక...'మేక్ ఇన్ ఇండియా' అభాసుపాలయింది. పెద్దనోట్ల రద్దు విపత్తును సృష్టించింది. జీఎస్టీ క్లిష్టంగా తయారైంది. 'ఆత్మనిర్భర్ భారత్' నకిలీ నినాదమని తేలింది. ఆస్తుల నగదీకరణ కూడా తప్పుడు పద్ధతులకు అంకురార్పణ కాబోతోంది. క్లుప్తంగా చెప్పాలంటే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం తీవ్రమవుతుంది. ప్రజల సంపదను ఆశ్రితులు దోచుకుంటారు. ప్రజా సమూహాలు నిష్ట దారిద్య్రంలోకి నెట్టబడతారు. తమ సాధికారతను కోల్పోతారు.
అభివృద్ధి ప్రక్రియలో ప్రజలకే ప్రాధాన్యత ఉండే విధంగా సామాజిక అభివృద్ధి జరగాలని 2018 జులైలో ప్రపంచ బ్యాంకు చెప్పింది. సామాజిక అభివృద్ధికి అర్ధం ప్రజల మీద పెట్టుబడి పెరగాలి. ఇందుకు ప్రజల మీద ఆటంకాలు తొలగించాలి. అపుడు మాత్రమే వారు విశ్వాసంతో, ఆత్మగౌరవంతో తమ కలల సాకారం వైపు ప్రయాణిస్తారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా పని చేస్తోంది. ఈ విధానాలలో ఉపద్రవాలు వెదజల్లబడి ఉన్నాయి.
- డా. సంతోష్ కుమార్ మహాపాత్ర ( సంక్షిప్తంగా )










