Apr 12,2023 21:09

మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు డి.వెంకట్రామయ్య

రాయచోటి టౌన్‌ : గ్రామ పంచాయతీ, స్వచ్ఛభారత్‌ కార్మికులు, టైం స్కేల్‌ వర్కర్స్‌కు 5 నుండి 18 నెలలు పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎపి గ్రామ పంచాయతీ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు డి.వెంకట్రామయ్య అన్నారు. బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ధరల పెరుగుదలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. టెండర్లు విషయంలో హైకోర్టు తీర్పు అమలు, సమానపనికి సమానవేతనం, ఉద్యోగాలు పర్మినెంట్‌ తదితర డిమాండ్ల పరిష్కారం కోసం గాంధీ జయంతి నుండి జరుపతలపెట్టిన నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం గ్రామీణ ప్రజానీకానికి నిరంతరం పారిశుధ్య సేవలందిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు, స్వచ్ఛభారత్‌ కార్మికులు, టైం స్కేల్‌ వర్కర్స్‌ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఒకటిన్నర సంవత్సరం జీతం రాకపోతే జీవితం ఎలా గడపాలో అధికారుల, పాలకులు చెప్పాలన్నారు. ఇరవై సంవత్సరాల సర్వీస్‌ ఉన్ననూ ఇయస్‌ఐ ఫీఎఫ్‌ నోచుకోలేకున్నారని వెంటనే ఇఎస్‌ఐ. పిఎఫ్‌ అమలు చేయాలన్నారు. సంక్షేమ పథకాల అమలు చేయడంతో పాటు చనిపోయిన వారి మట్టి ఖర్చులకు రూ.25 వేలు, ప్రమాద బీమా రూ.పది లక్షలు ఇవ్వాలన్నారు. అకారణంగా జిల్లా వ్యాప్తంగా తొలగించిన ఆరుగురు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే జాతీయ ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌కు పిర్యాదు చేస్తామన్నారు. తక్షణం పెండింగ్‌ జీతాల విడుదలకు పోరాడతామ్ననారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు, ఎపి గ్రామ పంచాయతీ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి పందు సురేంద్ర, నాయకులు రెడ్డెయ్య, రవికుమార్‌, నాగరాజు, ప్రమీల, శ్యామల, ఇమ్రాన్‌ పాల్గొన్నారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.