Mar 28,2023 22:31

నినాదాలు చేస్తున్న నాయకులు, కార్మికులు

ప్రజాశక్తి-కనగానపల్లి : కనగానపల్లి,రామగిరి సీపీడబ్ల్యూ ఎస్‌ పథకం కింద త్రాగునీరు సరఫరా స్కీం వర్కర్లుకు బకాయి పడ్డ 17 నెలలు వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు.మంగళవారం మండల పరిధిలోని నర్సంపల్లి పంప్‌ హౌస్‌ దగ్గర కనగానపల్లి, రామగిరి మండలాల పరిధిలోని సీపీడబ్ల్యూ ఎస్‌ స్కీం వర్కర్ల యూనియన్‌ జనరల్‌ బాడీ సమావేశం నాగార్జున అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఇఎస్‌. వెంకటేష్‌ మాట్లాడుతూ రామగిరి,కనగానపల్లి మండలాల్లో సుమారు 54 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే కార్మికులు 34 మంది 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని అన్నారు. గత కాంట్రాక్టర్‌ పరిధిలో ఏడు నెలలు, ప్రస్తుత కాంట్రాక్టర్‌ కింద పది నెలలు మొత్తం కలిపి 17 నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా కార్మికులను పండగ పూట కూడా పస్తులు పెట్టారని విమర్శించారు. గత 30 నెలలకు పైగా పిఎఫ్‌ అమౌంట్‌ కట్టకుండా ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కనీస వేతనాలు ఇవ్వకుండా పిఎఫ్‌ చెల్లించని కాంట్రాక్టర్లపై క్రిమినల్‌ కేసులు పెట్టి వారిని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్మికుల సమస్యలను సోమవారం లోపు పరిష్కరించకపోతే కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం సిఐటియు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మంజునాథ, ఉపాధ్యక్షులుగా నరసింహులు, ముత్యాలు, నూర్‌ మహ్మద్‌ కార్యదర్శిగా నారాయణస్వామి, సహయ కార్యదర్శులుగా ఓబుళపతి, శివయ్య, కోశాధికారిగా నాగార్జునతో పాటు 17 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.