ప్రజాశక్తి-విజయవాడ
విజయవాడ నగరపాలక సంస్థ వెహికల్ డిపోలో పని చేస్తున్న ఉద్యోగ, కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమ య్యారని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర నాయకులు చిగురుపాటి బాబూరావు హెచ్చరించారు. ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పూర్ణానందంపేటలోని వెహికల్ డిపో ఎదుట మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో గురువారం ధర్నా జరిగింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సమస్యలు పరిష్కరిం చకుండా మోసం చేసిన ప్రభుత్వం అని, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని కార్మికులు, నాయకులు చేసిన నినాదాలు మిన్నంటాయి. ధర్నా అనంతరం డిపో ఇన్‌చార్జ్ యోగేంద్రకు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్మికులనుద్దేశించి బాబూరావు మాట్లాడుతూ... మునిసిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించ కుండా ప్రస్తుత వైసిపి ప్రభుత్వం, గత టిడిపి ప్రభుత్వం తీవ్ర ద్రోహం, మోసం చేశాయని దుయ్యబట్టారు. వెహికల్ డిపోకార్మికులతో పాటు మునిసిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మూడు సంవత్సరాలు గడిచినా దాని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. గత 15-20 సంవత్సరాల నుంచి డిపోలో పని చేస్తున్న కార్మికులను నేటికీ పర్మినెంట్ చేయకపోవడం దారుణమన్నారు. మునిసిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు దోనేపూడి కాశీనాధ్ మాట్లాడుతూ...కార్మికుల సమస్యలను పరిష్కరిం చనట్లయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి ఎం డేవిడ్, యూనియన్ అధ్యక్షులు ఎస్‌జ్యోతిబాస్, నాయకులు స్టీఫెన్‌బాబు, సిఐటియు జిల్లా నాయకులు టి ప్రవీణ్, యూనియన్ నాయకులు ధనకొండ వెంకటేశ్వరరావు, వి నాగేశ్వరరావు, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు.










