Sep 02,2023 23:30

  • సిఐటియు నేతలు సిహెచ్‌.బాబూరావు, కాశీనాథ్‌ హెచ్చరిక
  • ధర్నా చౌక్‌లో మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికుల నిరసన దీక్ష

ప్రజాశక్తి-విజయవాడ : మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు ) నగర్‌ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా చౌక్‌లో నిరసన దీక్ష జరిగింది. నగరపాలక సంస్థ పరిధిలోని మూడు సర్కిళ్లలో పని చేస్తున్న ఇంజినీరింగ్‌ కార్మికులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ''ఆప్కాస్‌ వద్దు...పర్మినెంట్‌ ముద్దు అని, వేతనాలు పెంచాలని, హెల్త్‌ అలవెన్స్‌ మంజూరు చేయాలని నినాదాలు చేశారు. యూనియన్‌ నగర అధ్యక్షులు ఎస్‌ జ్యోతిబాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ విఎంసిలో పని చేస్తున్న ఇంజినీరింగ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తారని హెచ్చరించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం, విఎంసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ప్రాణాలను ఫణంగా పెట్టి కార్మికులు పనులు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చేసిన సిఫారసులను సైతం అమలు చేయడం లేదన్నారు. ఇంజనీరింగ్‌ వాటర్‌ అండ్‌ డ్రైనేజీ కార్మికులు నగర ప్రజలకు మంచినీటిని సరఫరా చేస్తున్నారని, కానీ కార్మికులకు మాత్రం కన్నీళ్లు మిగులుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు మునిసిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించి, పర్మినెంట్‌ చేయకుండా నాలుగున్నరేళ్ల నుండి కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఇంజనీరింగ్‌ కార్మికులను వైసిపి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. నగరంలోని వాటర్‌ వర్క్స్‌లో కార్మికుల సంఖ్య తగ్గిన కారణంగా ఉన్న కార్మికులపై విపరీతమైన పని భారం పెరిగిందన్నారు. దీని వల్ల కార్మికులు అనేకరకాలుగా ఇబ్బందుల గురవుతున్నారని అన్నారు. వ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. విపరీతమైన పని ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ వేతనాలు అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కార్మికులకు వర్తింప చేయకుండా కోత పెడుతోందని విమర్శించారు. సంక్షేమ పథకాలను కార్మికులకు వర్తింప చేయాలని, అంతేగాక కార్మికులందరినీ పర్మనెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ నగర్‌ గౌరవాధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్‌ మాట్లాడుతూ కనీసం కార్మికులకు పండగ పూట కానీ, ఆదివారాలు గాని సెలవులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సెలవులు మంజూరు చేయాలని విఎంసి అధికారులను డిమాండ్‌ చేశారు. ఇంజనీరింగ్‌ కార్మికులకు హెల్త్‌, రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలని కోరారు. పనిలో మాత్రం ఎమర్జెన్సీ వర్క్‌ అని పగలు, రాత్రనక కార్మికులతో పని చేయిస్తూ... జీతాలు మాత్రం ఎమర్జెన్సీ వర్క్‌కు తగినట్లుగా ఇవ్వడం లేదని అన్నారు. ఇంజనీరింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కార్మికులను కలుపుకొని తమ యూనియన్‌ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఇంజనీరింగ్‌ వాటర్‌ వర్క్స్‌ కార్మికులు నల్ల శ్రీను, ఉప్పు శ్రీను, జయపాల్‌, దుర్గారావు, వేణు, మహేష్‌, సైదులు, డ్రైనేజీ కార్మికులు నరేంద్ర, బత్తుల బ్రహ్మయ్య, జయరావు, షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం నిరసన దీక్షను సిఐటియు నాయకులు కె.దుర్గారావు, కోటి బాబు విరమింప చేశారు.