ధర్మవరం టౌన్ : పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దాడి చేసి నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్.వెంకటేష్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో సిఐటియు మండల అధ్యక్షులు ఎల్.ఆదినారాయణ, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజినేయులు, సిఐటియు మండల కార్యదర్శి అయూబ్ ఖాన్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ రంగాన్ని మొత్తం ప్రయివేటీకరించడం, ప్రభుత్వ ఆస్తులన్నీంటినీ అమ్మేయడమే లక్ష్యంగా ప్రధాని మోడీ పాలన సాగుతోందన్నారు. కార్మిక హక్కులను కాలరాసి నాలుగు లేబర్‌కోడ్‌లను అమలు చేయాలని చూస్తున్నారని చెప్పారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి పెట్టుబడిదారులకు లాభం చేసే కుట్రలను బిజెపి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసిపి కేంద్రం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించకుండా వత్తాసు పలికేలా వ్యవహరించడం దుర్మార్గం ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వెంటనే స్కీం వర్కర్లు, నిరుద్యోగులపై కక్ష కట్టి ఉద్యోగాల నుంచి తొలగించి చర్యలకు ఉపక్రమించిందన్నారు. ఇలాంటి వాటిని కార్మికులు ఐక్య ఉద్యమాలతో తిప్పికొట్టాలన్నారు. కార్మిక హక్కులను కాపాడుకునేందుకు సంఘటితంగా పోరు సాగించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌పోర్టు రంగం రాష్ట్ర నాయకులు రఫీ, పట్టణ నాయకులు తొండమాల బాబు, జబివుల్లా, రామంజి, రవి, మున్సిపల్ కార్మికసంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాబు, చెన్నకేశవులు, పుల్లన్న, మీటర్ రీడర్ నాయకులు దస్తగిరి, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.










