Dec 29,2022 20:16

మాట్లాడుతున్న రాష్ట్ర నాయకులు రమాదేవి

ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు రాబోయే రోజుల్లో కార్మిక పోరాటాలను మరింత ఉదృతం చేయనున్నట్లు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కటారి అజరుకుమార్‌, దయా రమాదేవి పిలుపునిచ్చారు. ఈ పోరాటాల్లో కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. పీలేరు నుంచి ప్రారంభమైన కార్మిక చైతన్య యాత్ర రెండో రోజు గురువారం రాయచోటికి చేరుకుంది. రాయచోటి పట్టణంలోని బంగ్లా వద్ద ఈ యాత్రకు సిఐటియు నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి ఎ.రామాంజులు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కటారి అజరుకుమార్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో షెడ్యూల్‌ కార్మికుల వేతనాలను సవరించేందుదకు కనీసం కనీస వేతన సలహా కమిటీని ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వానికి ఏ మాత్రం భారమయ్యేది కాకపోయినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. తద్వారా ప్రయివేటు సంస్థల యాజమన్యాలు కనీస వేతనాలను నామ మాత్రంగా ఇస్తన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోనున్న పరిశ్రమల్లో కేవలం ఆరేడు వేల రూపాయలు మాత్రమే వేతనమిస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని వైసిపి అధికారంలోకి వచ్చి తొలినాళ్లలో సిఐటియుగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇప్పటి వరకు కనీస వేతన సలహా కమిటీని ఏర్పాటు చేయలేదని విచారం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి లేబర్‌ కోడ్స్‌గా మారుస్తోందన్నారు. రక్షణగానున్న అనేక కార్మిక చట్టాలు పోనున్నాయని వివరించారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి నెలలో చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్నయించినట్టు తెలిపారు. ఏప్రిల్‌ ఐదవ తేదీన చలో ఢిల్లీ కార్యాక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాలకు కార్మికులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సిఐటియు రాష్ట్ర నాయకులు దయా రమాదేవి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ మూసివేసి అనేక మంది కార్మికులను వీధులపాలు జేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటుపరం చేసేందుకు పూనుకుంటే అక్కడి కార్మికులకు ఏడాదిగా పోరాటాలు సాగిస్తూ కాపాడుకుంటూ వస్తున్నారన్నారు. ఒకవైపు నిరుద్యోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నింటిపైనా రాష్ట్ర మహాసభల్లో చర్చించి జవనరి రెండు నుంచి బీమవరంలో జరగే రాష్ట్ర మహాసభల జయప్రదానికి కార్మిక ప్రజలు కృషి చేయాల్సిన ఆవశ్యకత అందరిదన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు మాట్లాడుతూ ధరలకనుణంగా కేరళలో రోజుకు రూ.800 చొప్పున రూ.24 వేలు ఇస్తే ఇక్కడ ప్రభుత్వం ఇసుక సిమెంట్‌ ధరలు పెంచి బిల్డింగ్‌ వెల్ఫేర్‌ బోర్డులు నాశనం చేస్తూ ఉపాధి లేకుండా చేయడం తగదన్నారు. వెయ్యి మందికి ఉపాధి కల్పించేవిధంగా పరిశ్రమ అవసరం ఉందన్నారు. భవిష్యత్లో మహాసభ కర్తవ్యాలు చర్చించి కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎవి.రమణ, ఓబులమ్మ, ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి భాగ్యలక్ష్మి, మెహరున్నీసా, సుబ్రహ్మణ్యంరాజు, నాగేశ్వర గౌడ్‌, ఖాజాబి, విజయ, సిద్దమ్మ, సురేఖ, రామచంద్ర, మాధవ బిల్డింగ్‌, ఆటో, హమాలీ, కార్మికులు పాల్గొన్నారు.