కడప అర్బన్ : కార్మిక ఉద్యమ నిర్మాత పర్సా సత్యనారాయణ అని పలువురు నాయకులు అన్నారు. సోమవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో పర్సా 8వ వర్థంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి సిఐటియు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ సిఐటియు ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులుగా 1970 నుంచి 2022 ఉన్నారని తెలిపారు. సమస్యలపై రాజీలేని పోరాటం నిర్వహించారని చెప్పారు. 1924, జూన్ 2న జన్మించారని పేర్కొన్నారు. 19 సంవత్సరాల వయసులోనే నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని తెలిపారు. కార్మికుల జీవితాలలో వెలుగు నింపడానికి ఉద్యమాలను ఆయుధంగా చేసుకున్నారని చెప్పారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశంఖం పూరించడానికి ఆయన ఆధ్యుడిగా నిలిచారని పేర్కొన్నారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ స్థాపించి కార్మికుల జీవితాల్లో మార్పు కోసం అనేక పోరాటాలు యూనియన్ ద్వారా నిర్వహించారని కొనియాడారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసులురెడ్డి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామమోహన్, నగర ప్రధాన కార్యదర్శి పి.వెంకటసుబ్బయ్య, మున్సిపల్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి వై.ఎం.కేశవులు, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెంకటేష్, రిమ్స్ పవన్, ఉదరు, ఆవాజ్ జిల్లా కార్యదర్శి పరూక్ హుస్సేన్, నరేష్, మల్లి, శికామణి, శివాజీ, చంద్ర పాల్గొన్నారు.










