Dec 23,2022 21:42

సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌

ప్రజాశక్తి -పెనుకొండ: ఈనెల 28న ప్రారంభమయ్యే కార్మిక సమరభేరి యాత్రను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌ కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ఆర్‌ అండ్‌ బి అతిధి గృహం వద్ద వద్ద సిఐటియు అనుబంధ సంఘాల నాయకులతో సిఐటియు మండల కార్యదర్శి బాబావలి అధ్యక్షత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రమేష్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాలు నుంచి ప్రారంభమయ్యే కార్మిక సమరభేరి యాత్రలు జనవరి 2వ తేదీన భీమవరానికి చేరుకుంటాయన్నారు. హిందూపురంలో ప్రారంభించే జాతాకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గపూర్‌ హాజరవుతున్నారని తెలిపారు. కార్మికుల కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పన కోసం జరిగే కార్మిక సమరభేరి జాతలో ఉద్యోగ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌పోర్టు రంగం రాష్ట్ర నాయకులు రఫీ , బాబా, గౌస్‌ లాజం, సివిల్‌ సప్లై హమాలీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షులు బావమ్మ, నగర పంచాయతీ కార్మికుల యూనియన్‌ నాయకులు వెంకటేష్‌, రిక్షా నర్సింహులు, ఈ వెంకటేష్‌, తిప్పన్న, ఆటో కార్మికుల నాయకులు వజ్రం నాగప్ప, భవననిర్మాణ కార్మిక సంఘం నాయకులు మహేష్‌, శ్రీరాములు, నాగరాజు, బాబు, అంజి తదితరులు పాల్గొన్నారు.