అనంతపురం ప్రతినిధి, హిందూపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను విదేశీ కంపెనీలు, పెట్టుబడిదారులకు తాకట్టుపెట్టి కార్మికులకు తీరని అన్యాయం చేస్తోందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ.గఫూర్ విమర్శించారు. ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు రాబోయే రోజుల్లో కార్మిక పోరాటాలను మరింత ఉధృతం చేయనున్నట్టు తెలియజేశారు. భీమవరంలో జరిగే సిఐటియు 16వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం అంబేద్కర్ సర్కిల్ నుంచి కార్మిక చైతన్యయాత్ర గురువారం ప్రారంభం అయ్యింది. యాత్రను సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు ఆర్‌వి.నరసింహారావు, స్వరూపరాణి, జి.ఓబులు, నూర్‌మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వందలాది మంది కార్మికులు హిందూపురం పట్టణం సూగూరు ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టణ పురవీధుల్లో అంబేద్కర్ సర్కిల్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్‌లో జరిగిన బహిరంగ సభలో నాయకులు ప్రసంగించారు. మొదటి రోజు హిందూపురం నుంచి ప్రారంభమైన 'కార్మిక చైతన్యయాత్ర' పెనుకొండ, అనంతపురం, బుక్కరాయసముద్రం, తాడిపత్రి మీదుగా రాత్రికి కడపజిల్లా ప్రొద్దుటూరుకు చేరింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో గఫూర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు రెండూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని విమర్శించారు. కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి సాధించుకున్న 45 కార్మిక చట్టాలను కాలరాసి నాలుగు లేబర్‌కోడ్‌లుగా తీసుకురావడంలో ప్రభుత్వాల కుట్ర దాగుందన్నారు. ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో బ్రిటిష్ పాలన కన్నా హీనంగా ఉందన్నారు. రెండు ప్రభుత్వాలూ కార్మికుల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నాయన్నారు. ఆంధ్రుల హక్కుగా ఉన్న విశాఖ ఉక్కును బిజెపి ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులకు అమ్మడానికి సిద్ధం ఉందన్నారు. కేంద్రం తరహాలో రాష్ట్రం గంగవరం, కృష్ణపట్నం పోర్టులతో పాటు రూ.25 వేలకోట్ల విద్యుత్ జెన్‌కోను ఆదానీకి అప్పగించడానికి రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించిందన్నారు. ప్రభుత్వ భూములను అప్పనంగా ఆదానీకి ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆదానీప్రదేశ్‌గా మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ ప్రతఘటించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన విధంగా కార్మికులకు కనీస వేతన చట్టం, బోనస్, పిఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ తదితర సదుపాయాలన్నింటినీ వెంటనే వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అవుట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. హిందూపురం, అటు చిత్తూరు జిల్లాల్లో పది కిలోమీటర్ల అవతులున్న కర్నాటక, తమిళనాడులో గార్మంట్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు నెలకు వేతనం రూ.13,500 నుంచి రూ.14000 వరకు ఇస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనున్న పరిశ్రమల్లో ఆరువేలకు మించి ఇవ్వడం లేదన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సిఐటియు కనీస వేతనాలపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. దీనిపై ఇప్పటి వరకు కనీస వేతన సలహా కమిటీని ఏర్పాటు చేయలేదని విచారం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి నెలలో చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీన చలో ఢిల్లీ కార్యాక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాలకు కార్మికులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సిఐటియు ఉపాధ్యక్షురాలు స్వరూపరాణి మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ మూసివేసి అనేక మంది కార్మికులను వీధులపాలు జేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటుపరం చేసేందుకు పూనుకుంటే అక్కడి కార్మికులకు ఏడాదిగా పోరాటాలు సాగిస్తూ కాపాడుకుంటూ వస్తున్నారన్నారు. ఒకవైపు నిరుద్యోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నింటిపై జవనరి 2వ తేదీ నుంచి భీమవరంలో జరగే సిఐటియు రాష్ట్ర మహాసభల్లో పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జెడ్పీ.శ్రీనివాసులు, ఈఎస్.వెంకటేష్, అనంతపురం సిఐటియు జిల్లా అధ్యక్షులు నాగమణి, ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, శ్రామిక మహిళ జిల్లా కార్యదర్శి దిల్‌షాద్, జిల్లా నాయకులు రమేష్, అనంతపురం జిల్లా నాయకులు గోపాల్, వెంకటనారాయణ, ఎపి మున్సిపల్ వర్కర్సు అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాస్ట్ర అధ్యక్షులు నాగభూషణం, సత్యసాయి జిల్లా సిఐటియు నాయకులు లక్ష్మీనారాయణ, బాబావలి, బావమ్మతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిఐటియు రాష్ట్ర కమిటీ రూ.లక్ష చెక్కును అందజేసిన శ్రీరామిరెడ్డి, సత్యసాయి కార్మికులు
సిఐటియు రాష్ట్ర కమిటీకి లక్ష రూపాయల చెక్కును జిల్లాలోని శ్రీరామిరెడ్డి, సత్యసాయి వాటర్ వర్కర్స్ యూనియన్ తరుపున ఆ సంఘం నాయకులు అందజేశారు. యాత్ర సందర్భంగా అనంతపురం నగరంలోని నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ.గపూర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎ.గఫూర్ మాట్లాడుతూ వాటర్ వర్కర్స్ ఈ రకంగా రాష్ట్ర కమిటీ ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ముందుకురావడం అభినందనీయం, ఆదర్శనీయమన్నారు. ఇది సిఐటియు ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాలకు మరింత దోహదం చేసేందుకు తోడ్పాటును అందించినట్టు అవుతుందని తెలిపారు.










