ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన సీనియర్ నేత ఎల్.రమణ కారెక్కారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కెటి రామారావు సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ ఆయనకు టిఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే టిఆర్‌ఎస్‌లో చేరినట్లు చెప్పారు. ఈనెల 16న సిఎం కెసిఆర్ సమక్షంలో నిర్వహించే సభలో ఎల్.రమణకు కెసిఆర్ గులాబీ కండువా కప్పుతారు. అదేరోజు రమణ అనుచరులు, అభిమానులతో పాటు జగిత్యాలకు చెందిన పలువురు నేతలు టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు.










