Mar 03,2023 20:43

నిరసన తెలుపుతున్న వామపక్షాలు

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : బడినికొండ గ్రామ పంచాయతీ సాయి కొండ ప్రాంతంలో రైతుల అనుమతులు లేకుండా మట్టిని తవ్వి తరలించిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టర్‌కు సహకరించిన తహశీల్దార్‌ను సస్పెండ్‌ చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, సిపిఐ నాయకులు కృష్ణప్ప మాట్లాడుతూ తురకపల్లి గ్రామ పంచాయతీలో నివాసముండే ఏడుగురు ముస్లీం మైనారిటీకి చెందిన పేద రైతులకు భూపంపిణీ పట్టాలు ఇచ్చారని, ఈ పట్టాలను రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌ చేయకుండా, వారి అనుమతులు తీసుకోకుండా కాంట్రాక్టర్‌తో డబ్బుకు అమ్ముడుపోయారని విమర్శించారు. రైతుల పొలాల్లో మట్టిని తవ్వడానికి తహశీల్దార్‌ సహకరించారని తెలిపారు. నేషనల్‌ హైవే పేరుతో మట్టిని తవ్వి ప్రైవేట్‌ స్థలాలకు తరలిస్తున్నారని, ఇదే మట్టిని వేల రూపాయలకు అమ్ముకొని వ్యాపారం చేసుకొంటున్నారన్నారు. సాయికొండ సగానికి పైగా తవ్వి అమ్ముతుంటే రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. తహశీల్దార్‌ నుంచి సచివాలయం అధికారుల వరకు అందరికీ పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టాయని అందుకే ఏ అధికారి కూడా పట్టించుకోలేదని అనుమానం వ్యక్తం చేశారు. రైతులకు ఏ ప్రాతిపదికన తమ పాస్‌ బుక్కులను ఎందుకు ఆన్‌లైన్‌ చేయలేదో చెప్పాలన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి పట్టాలు ఉన్న ముస్లీం మైనారిటీ రైతులకు తమ పట్టాలను ఆన్‌లైన్‌ చేసి పాస్‌బుక్‌లు ఇవ్వాలని తెలిపారు. రైతుల అనుమతులు లేకుండా మట్టిని తవ్విన కాంట్రాక్టర్‌పై కేసులు నమోదు చేయాలని, వారికి సహకరించిన రెవెన్యూ, సచ్చివాలయం అధికారులను, తహశీల్దార్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి బాధితులు షఫీ, ఫిరోజీ, మబ్బాష, జయనబీ, గులజరబీ పాల్గొన్నారు.